మన్సూరాబాద్, జూన్ 26: కాలనీల్లో తిరుగుతూ.. తాళం వేసి ఉన్న ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ. 18 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు, మూడు కేజీల రెండు వందల గ్రాముల వెండి వస్తువులు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరేట్ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం, మునుగవేడు గ్రామానికి చెందిన దాసరి జంపయ్య, అదే జిల్లాకు చెందిన ఆనరెడ్డి రవి అలియాస్ రమేశ్‌లు అడ్డగుట్ట, తుకారంగేట్‌లో ఉంటూ.. ఓ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌లుగా పని చేస్తున్నారు.
అదే జిల్లాకు చెందిన అంగడి రాజు హయత్‌నగర్, రాఘవేంద్రకాలనీలో నివాసముంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ ముగ్గురు బంధువులు.. జల్సాలకు అలవాటుపడి.. డబ్బు కోసం కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ ముగ్గురు పలు దొంగతనం కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లివచ్చారు.. తిరిగి హయత్‌నగర్ పీఎస్ పరిధిలో 10, అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలో 1, వనస్థలిపురం పీఎస్ పరిధిలో 2, తూప్రాన్ పీఎస్ పరిధిలో 2, ఖమ్మం జిల్లా కామెపల్లి పీఎస్ పరిధిలో 1, కొత్తగూడెం జిల్లా మణుగూరు పీఎస్ పరిధిలో 1, టేకులపల్లి పీఎస్ పరిధిలో 1 మొత్తం కలిపి 18 ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు.. హయత్‌నగర్ పీఎస్ పరిధిలో జరిగిన ఓ దొంగతనం కేసులో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. శనివారం రాజు, జంపయ్యలను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు రమేశ్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, సీఐ సురేందర్, డీఐ నాగార్జున, సిబ్బంది పాల్గొన్నారు.