శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9 : గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం సమీపంలోని సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో చోరీ కేసును పోలీసులు 24గంటల్లోనే ఛేదించారు. బ్యాంకు స్ట్రాంగ్ రూం తెరిచేందుకు విఫలయత్నం చేసి, కంప్యూటర్ సామగ్రి ఎత్తుకెళ్లిన దంపతులను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సెంట్రల్ బ్యాంకు సీసీటీవీ కెమెరాల వైర్లు కత్తిరించి, డీవీఆర్‌ను ఎత్తుకెళ్లినప్పటికీ, బ్యాంకు ఉన్న వాణిజ్య సముదాయంలోని ఇతర సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించడంతో నిందితుల ఆనవాళ్లు అందులో రికార్డు అయ్యాయి. బుధవారం ఉ.5.08 నిమిషాలకు కంప్యూటర్ సామగ్రితో ట్రాలీ ఆటోలో గచ్చిబౌలి వైపు వెళుతున్న దృశ్యాలు పోలీసులకు లభించాయి. గచ్చిబౌలి పీఎస్ సమీపంలోని ట్రిపుల్ఐటీ జంక్షన్ వద్ద ఉన్న సీసీటీవీలో ట్రాలీ ఆటో నెంబర్ గుర్తించారు. దాని ఆధారంగా గోపన్‌పల్లికి చెందిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, అప్పులు ఎక్కువ కావడంతో తొలిసారిగా దొంగతనానికి యత్నించామని చెప్పినట్లు సమాచారం.