సిటీబ్యూరో, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా 160 చోరీలు చేశాడు.. 30 ఏండ్లుగా ఈ నేర వృత్తిని కొనసాగిస్తున్నాడు. పైగా 22 సార్లు జైలుకు వెళ్లినా..మారలేదు. ఇంతటి కరుడుగట్టిన ఘరానా దొంగను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 18 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. మహ్మద్ సలీం అలియాస్ సునీల్‌శెట్టి(నటుడు సునీల్‌శెట్టి అంటే విపరీతమైన అభిమానంతో ఆ పేరు పెట్టుకున్నాడు.) నవాబ్ సాహెబ్ కుంటకు చెందినవాడు. 1991 నుంచి ఇప్పటి వరకు 160 దొంగతనాలు చేశాడు. మధ్య తరగతి కుటుంబాలనే లక్ష్యంగా చేసుకొని వారి ఇండ్లను దోచేస్తాడు. అనేకసార్లు పట్టుబడిన సలీంపై 2018లో కంచన్‌బాగ్ పోలీసులు పీడీయాక్టు ప్రయోగించారు.
ఈ ఏడాది మార్చిలో జైలు నుంచి బయటకు వచ్చినా.. తన నేర వృత్తిని మానలేదు. 12 ఇండ్లను కొల్లగొట్టాడు. చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఛత్రినాక, పహాడీషరీఫ్, బాలాపూర్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. తరచూ దొంగతనాలు చేస్తూ.. దొరికిపోతుండటంతో పోలీస్ శాఖలో ఇతడిని చాలా మంది సులువుగానే గుర్తించేవారు. మరోవైపు నగరంలో నిఘా నేత్రాలు ఎక్కువగా ఉండటం.. తనను పోలీసులు త్వరగా గుర్తిస్తారనే ఉద్దేశంతో ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ఎంచుకొని చోరీలు చేయడం ప్రారంభించాడు. విశ్వసనీయ సమాచారంతో సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, చాంద్రాయణగుట్ట పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి 36.5 తులాల బంగారం, కేజీ వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.