సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ అధికారులపై కార్మికులు కన్నెర్ర జేశారు. గడిచిన 20 సంవత్సరాలుగా నాగోల్ డంపింగ్ యార్డులో చెత్త ఏరుకొని కాలం వెళ్లదీస్తున్న తమ పొట్ట కొడుతున్నారని, రాంకీ సంస్థకు కొమ్ముకాస్తున్నారంటూ ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్‌ను కార్మికులు అడ్డుకున్నారు. బుధవారం డంపింగ్ యార్డుకు వచ్చిన డీసీని కార్మికులు నిలదీశారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డీసీతో వాదించారు.
డంపింగ్‌యార్డును నమ్ముకుని జీవనం గడుపుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాంకీ నిర్వహణ పరిధిలో ఉన్నదని అధికారులు చెప్పినా కార్మికులు మాత్రం ప్రైవేట్ ఏజెన్సీకి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. చెత్త ఏరుకొని బతికే కార్మికులను ఆదుకోవాలని, కమిషనర్ రొనాల్డ్‌రాస్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలన్నారు. లేదంటే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు దిగుతామని కార్మికులు పేర్కొన్నారు.