కీసర, జనవరి 12 : పెండ్లి అయి 15 సంవత్సరాలు కాగా ఇద్దరు పిల్లలు.. గత ఐందేండ్లుగా కనిపించకుండా మరో మహిళతో ఉంటున్నాడని గుర్తించిన మొదటి భార్య.. భర్త ఇంటి ముందు పిల్లలతో ధర్నాకు దిగింది. అనంతరం కీసర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ప్రాంతానికి చెందిన సాయి చరణ్, శిల్ప దంపతులకు గత 15 సంవత్సరాల క్రితం పెండ్లి కాగా.. 5 సంవత్సరాల ఇద్దరు పిల్లలున్నారు. అయితే.. గత అయిదు సంవత్సరాల నుంచి సాయిచరణ్ భార్యకు చెప్పకుండా వెళ్లిపోయాడు.
అప్పటి నుంచి శిల్ప వెతుకుతుండగా.. భర్త మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్లోని అహ్మద్‌గూడలో మరో మహిళతో కాపురం పెట్టాడని గుర్తించి.. ఆ ఇంటి ముందు తన ఇద్దరు పిల్లలతో ధర్నాకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయం అక్కడి వచ్చి తనను పట్టించుకోకుండా వెళ్లిపోయారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. తననే పోలీసుస్టేషన్‌కు రమ్మంటూ, లేదంటే అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు చెప్పారని ఆమె మీడియా ముందు తమ గోడును చెప్పుకుంది. అనంతరం తనకు, పిల్లలకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరిగేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అన్నది. తనను పోలీసులు పట్టించుకోకపోతే ఒంటిమీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకొంటానని హెచ్చరించింది.