ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 20: ఉస్మానియా యూనివర్సిటీలో వారం రోజులుగా నిర్వహిస్తున్న గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు సోమవారం ముగిశాయి. ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల ముగింపులో భాగంగా ఎన్సీసీ గేటు నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు సేవాలాల్ శోభాయాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో గిరిజన మహిళలు సంప్రదాయ వేషధారణలో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనారిటీ సెల్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రీసర్చ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా వ్యాసరచన, వక్తృత్వం, సింగింగ్, డ్యాన్సింగ్, పెయింటింగ్ తదితర అంశాలలో పోటీలు నిర్వహించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన సభలో బహుమతులు అందజేశారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఢిల్లీలో ప్రభుత్వ మాజీ ప్రతినిధి రామచంద్రు తేజావత్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, ట్రైబల్ చైల్డ్ అండ్ వుమెన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ నోడల్ ఆఫీసర్ ధర్మానాయక్, జీఎస్టీ మాజీ అసిస్టెంట్ కమిషనర్ ధనంజయనాయక్, యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సేవాలాల్ జీవిత చరిత్రను వివరించారు. జాతి కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహామనిషి సేవాలాల్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తి జయంతిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిజాం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ భీమానాయక్, బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, మైనారిటీ సెల్ డైరెక్టర్ అజీమున్నీసా బేగం, అంబేద్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కొండా నాగేశ్వర్, పీజీఆర్ఆర్సీడీఈ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్, హెచ్ఆర్డీసీ డైరెక్టర్ ప్రొఫెసర్ స్మిత పవార్, తెలుగు విభాగం మాజీ హెడ్ ప్రొఫెసర్ సూర్యాధనంజయ, సీఐ రమేశ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.