సిటీబ్యూరో/సికింద్రాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మరోసారి గెలుపు దిశగా.. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను ప్రధాన అస్ర్తాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నాయకులు, కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు, తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు. ప్రధాన చౌరస్తాలలో ధూంధాంలు కూడా నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
సికింద్రాబాద్‌లో అడ్డగుట్ట, మెట్టుగూడ, బౌద్ధనగర్, సీతాఫల్‌మండీ, తార్నాక డివిజన్లు ఉన్నాయి. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12 వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. పాఠశాలలు, కాలేజీ, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, దవాఖానలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు సంక్షేమ పథకాలు కూడా అర్హులందరికీ అందేల చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,56,577 ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే గడప గడపకు వెళ్తున్న నాయకులు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు.
ప్రతిపక్షాలు డీలా..
సికింద్రాబాద్‌లో అధికార పక్షం దూకుడు ముందు ప్రతిపక్షాలు నిలవలేకపోతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మారావు గౌడ్ సీఎం కేసీఆర్‌కు ఆత్మీయుడు. ప్రజలకు పజ్జన్న అంటే గౌరవం పెరిగింది. ఆపదలో అండగా ఉంటాడని ప్రజల్లో పేరుంది. క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి అనూహ్య స్పందన వస్తోంది. ఇది చూసి కాంగ్రెస్, బీజేపీలు ముందుగానే చేతులెత్తేస్తున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థులను బరిలోకి దించడానికి రెండు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. హై కమాండ్ నుంచి సీటు ఖరారు కాకున్నా కొంతమంది మేమే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులమని ప్రచారంలో దిగడం హాస్యాస్పందంగా ఉందని ప్రజలు వాపోతున్నారు.