ఖైరతాబాద్ : దాడి చేశారంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. తనపైనే పోలీసులు తప్పుడు కేసు పెట్టి తీవ్రంగా కొట్టారని హఫీజ్‌పేటకు చెందిన బాధితుడు షేక్ ఇర్ఫాన్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 15న తమ కాలనీలో నివాసముండే రజనీకాంత్, వారి కుటుంబసభ్యుల పిల్లలు ఆడుకుంటుండగా, తమ పిల్లలను దూషించడమే కాకుండా అకారణంగా దాడి చేసి తీవ్రంగా కొట్టారన్నారు.
మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే తనపై తప్పుడు కేసు పెట్టడంతో పాటు రోజంతా పోలీస్ స్టేషన్లో పెట్టి థర్డ్ డిగ్రీని ప్రయోగించి తీవ్రంగా కొట్టారన్నారు. దీనిపై డీజీపీతో సహా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వమైనా తనకు న్యాయం చేయాలని కోరారు. ఇంటి ముందు ఆడుకుంటున్న తన కొడుకును విచక్షణారహితంగా కొట్టడంతో పాటు నిలదీసినందుకు తనపై కూడా మూకుమ్మడిగా దాడి చేశారంటూ హఫీజ్‌పేటకు చెందిన రజనీకాంత్ తెలిపారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి సందర్భంగా తన పిల్లలతో పాటు కుటుంబసభ్యుల పిల్లలు కాలనీలోని ఆడుకుంటుండగా, బస్తీకి చెందిన కొందరు వేగంగా బైక్‌పై వస్తున్నారని, వారిని మెల్లగా వెళ్లమని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసి.. 15 మందిని రప్పించుకొని తన కొడుకుపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారన్నారు. విషయం తెలియడంతో వారిని నిలదీసేందుకు వెళ్తే తనతో పాటు తన అల్లుడిపై కూడా దాడి చేసి కొట్టారన్నారు. దీనిపై మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దాడి చేసిన వారిలో రౌడీషీటర్లు కూడా ఉన్నారని, ఇప్పటివరకు పోలీసులు ఎవరిపై చర్యలు తీసుకోలేదన్నారు. వారితో తన కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు.