సనత్‌నగర్ నియోజకవర్గంలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ చెక్కుల పంపిణీ
బేగంపేట్ : మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని 71 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకంలో మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.
అనంతరం లబ్దిదారులతో సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… దేశంలో ఎక్కడ లేని విధంగా పేదింటి ఆడపడుచుల వివాహానికి ఆర్థిక సహాయం అందిస్తున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమే నని అన్నారు. ఇప్పటి వరకు 13 లక్షల మంది ఈ పథకంలో లబ్థిపొందారని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీలు ప్రసవం అనంతరం క్షేమంగా ఇంటికి చేర్చేందుకు 300 అమ్మ ఒడి వాహనాలకు ఏర్పాటు చేసిందని చెప్పారు. అలాగే కేసీఆర్ కిట్టు, అడబిడ్డకు రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ. 12వేలు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు.
ఇప్పటి వరకు 11 లక్షల కేసీఆర్ కిట్టులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహేశ్వరి, కుర్మ హేమలతా, దీప్తి, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, ఆకుల రూప, తాసిల్థార్లు బాలశంకర్, జానకి తదితరులు పాల్గొన్నారు.