సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యూనల్) ఆదేశాల మేరకు ఆమ్రపాలి ఏపీలో బుధవారం రిపోర్టు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి సేవలు మూడు నెలల ముచ్చటగానే మిగిలాయి. 2024 జూన్ 26న కమిషనర్ రోనాల్డ్ రాస్ సెలవులో వెళ్లిన సందర్భంగా ఆమ్రపాలికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించారు. తర్వాత 2024 ఆగస్టు 21 నుంచి పూర్తిస్థాయి కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నారు. నాలుగు నెలల తిరగకముందే అమరావతికి ఆమ్రపాలి రిపోర్టు చేశారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ కంటే ముందు ఆమ్రపాలి మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఎండీగా, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా పనిచేస్తూనే బల్దియా కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. కొన్ని రోజులు మూడు బాధ్యతలు నిర్వర్తించారు. ఏ బాధ్యతల్లోనూ తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకోలేకపోయారు.
ప్రధానంగా జీహెచ్ఎంసీలో మహిళా ఉద్యోగులకు ప్రతి జోన్కు ఒక బేబీ కేర్ సెంటర్ ఏర్పాటు లాంటి కీలక నిర్ణయం తప్ప.. పెద్దగా సంస్కరణలు, కొత్త విధానాలు తీసుకువచ్చే ప్రయత్నమేమీ చేయకపోవడం, ప్రజావాణికి, జోనల్ కమిషనర్లకు, విజిటింగ్ సమయంలో వచ్చే పౌరులకు అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బక్కచిక్కిన సంస్థ ఖజానాను గాడిలో పెట్టే ప్రయత్నం కానీ, పారిశుధ్య నిర్వహణను చక్కదిద్దడంలో విఫలం అయ్యారనే ఆరోపణలున్నాయి. వందకు వంద శాతం చెత్త సేకరణ, శానిటేషన్ విభాగంలో అక్రమాలను అడ్డుకట్ట వేయలేకపోయారు.
ఏడాదిలోపే క్యూ కడుతున్న కమిషనర్లు
గ్రేటర్లో కీలకమైన శాఖ ఏదైనా ఉందంటే అది జీహెచ్ఎంసీ మాత్రమే. కోటికి మందికి పైగా జనాభా కలిగిన నగరంలో పౌరులకు మౌలిక వసతుల కల్పన, మెరుగైన సేవలందించడంతో జీహెచ్ఎంసీదే ముఖ్య భూమిక. అలాంటి కీలకమైన శాఖకు కమిషనర్గా పట్టుమని రెండేండ్లు సైతం ఉండటం లేదు. కారణం ఏదైనా అలా వచ్చి .. ఇలా వెళ్తున్నారు. ఆమ్రపాలి కంటే అంతకు ముందు ఉన్న కమిషనర్ రోనాల్డ్ రాస్ సైతం బల్దియాపై పట్టు సాధించి గాడిలో పెట్టే సమయంలోపే ప్రభుత్వం ఇంధనశాఖకు బదిలీ చేసింది. దీంతో దాదాపు ఏడాది గడవకముందే రోనాల్డ్ రాస్ సేవలు జీహెచ్ఎంసీలో ముగిసినైైట్లెయింది. తర్వాత వచ్చిన కమిషనర్ ఆమ్రపాలి ప్రస్తుత పరిణామాలతో నాలుగు నెలల్లోపే జీహెచ్ఎంసీనే కాదు రాష్ర్టాన్ని వీడాల్సి వచ్చింది.
కమిషనర్గా ఇలంబర్తి..
జీహెచ్ఎంసీ కమిషనర్గా (ఎఫ్ఏసీ)గా ఇలంబర్తికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ నుంచి రిలీవ్ అయిన ఐఏఎస్ల స్థానాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్చార్జీలను నియమించగా.. ట్రాన్స్పోర్టు కమిషనర్గా పనిచేస్తున్న ఇలంబర్తికి జీహెచ్ఎంసీ బాధ్యతలు అప్పగించారు. అయితే డీవోపీటీ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన ఆమ్రపాలి ఏపీ లో రిపోర్టు చేశారు. ఈ క్రమంలో ఇలంబర్తి జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.