చిక్కడపల్లి, అక్టోబర్ 13: సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ ఆధ్వర్యంలో సుద్దాల జానకమ్మ హనుమంతు సాహితీ, జానపద-నృత్య పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద, ఉస్మానియా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ రఘు తదితరులు హాజరయ్యారు.
సుద్దాల జానకమ్మ హనుమంతు సాహితీ, జానపద -నృత్య పురస్కారాలను ప్రముఖ రచయిత్రి ఓల్గా, ప్రముఖ జానపద, సినీ గాయిని మధుప్రియ, ప్రముఖ నర్తకి లాలీ నిధికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద మాట్లాడుతూ.. సుద్దాల హనుమంతు పాటలు, రచనలు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ప్రొఫెసర్ రఘు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో పాటలను పోరుబాటగా నడిపించారని అన్నారు. ఉత్త్తేజభరితమైన పాలటలతో ప్రజల్లో చైతన్యం తీసుకోచ్చారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారుడు సుద్దాల సుధాకర్ తేజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రచ్చ భారతి, సీహెచ్ స్వప్న, సాహితి తదితరులు పాల్గొన్నారు.