జూబ్లీహిల్స్, డిసెంబర్ 25: క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన జూబ్లీహిల్స్‌లోని ఎస్పీఆర్హిల్స్ మైదానం పూర్వవైభవాన్ని కోల్పోతున్నది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా.. వాహనాలకు పార్కింగ్ స్థలంగా మారిపోతున్నది. సరైన లైట్లు.. సీసీ కెమెరాల నిఘా..పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో మందుబాబులు..గంజాయి బ్యాచ్‌లు హల్చల్ చేస్తున్నాయి. సుమారు 50 ఏండ్ల కిందట వడ్డెరలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకొని ఇక్కడ ఉన్న రాళ్ల గుట్టను తొలిచివేయడంతో ఈ స్థలం భారీ లోయగా మారింది. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతాన్ని నాటి నుంచి క్వారీ ల్యాండ్‌గా పిలుస్తుంటారు.
దశాబ్దాల నుంచి పట్టించుకునే వారు లేకపోవడంతో అన్యాక్రాంతమైపోతున్న ఈ స్థలాన్ని కాపాడేందుకు దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చర్యలు తీసుకున్నారు. ఇందులోభాగంగానే ఈ స్థలాన్ని ప్రజోపయోగంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కొన్నేండ్లు శ్రమించి ఈ భారీ లోయను పూడ్చి చదును చేశారు. అనంతరం ఈ ప్రాంతంపై పూర్తి అధ్యయనం చేసి యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ఇక్కడ మైదానాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అప్పటికే ఆక్రమణలకు గురైన ఈ స్థలం చివరికి 9.05 ఎకరాలు మాత్రమే మిగలడంతో దాని చుట్టూ ఫెన్సింగ్ వేయించి.. తరచూ క్రీడలు నిర్వహిస్తూ మినీ స్టేడియంగా మారుస్తానని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఎస్పీఆర్‌హిల్స్‌లోని 25 ఉమ్మడి బస్తీలతో పాటు చుట్టుపక్కల ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మాగంటి ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా, దీపావళి, క్రిస్మస్, రంజాన్ ఇలా ఏ పండుగైనా, మరే వేడుకైనా ఈ మైదానంలో ఘనంగా జరుపుకొనేవారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఈ క్రీడా మైదానం నెలవుగా మారిపోయింది. దురదృష్టవశాత్తు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మికంగా మృతి చెందడంతో మైదానం పూర్వ వైభవాన్ని కోల్పోయింది.
ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఎవరు వాహనాలు పార్క్ చేస్తున్నారో తెలియదు. రాత్రి కాగానే లెక్కకు మించిన వాహనాలు ఇక్కడకు చేరుకుంటున్నాయి. చాలా వాహనాలు చాలాకాలంగా ఉంటున్నా.. ఎవరూ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. గురువారం ఇక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడాది కాలంగా పార్క్ చేసి ఉన్న కారు కూడా దగ్ధమైంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.