సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : మూడు రోజులుగా ఆర్టీఏ సర్వర్ మొరాయిస్తుండటంతో వివిధ రకాల సేవలకు బ్రేకులు పడ్డా యి. ఆర్టీఏ సేవలు పొందాలంటే రవాణా శాఖకు సంబంధించిన ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఫీజుల ట్రాన్షక్షన్స్ ప్రక్రియ సాంకేతిక ఇబ్బందులతో పూర్తి కావడం లేదు. దీంతో సేవలు ముందుకు సాగక రద్దు చేయాల్సి వస్తోంది.
వాహన్, సారథి పోర్టల్స్ ప్రారంభం నుంచి సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. స్లాట్ బుక్ చేసుకోవడంలో ఓటీపీల సమస్య, వాహన రిజిస్ట్రేషన్లలో పోర్టల్ పనితీరు సరిగా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మరోవైపు కొత్త సాఫ్ట్వేర్ కావడంతో సర్వర్ సమస్యలు, ప్రాసెసింగ్ జాప్యం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయని, తొందరలోనే సాంకేతిక ఇబ్బందులు తొలిగిపోతాయని ఆర్టీఏ అధికారులు చెబుతుండటం గమనార్హం.