ఎర్రగడ్డ, జనవరి 9: హైదరాబాద్ సారథినగర్‌లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు రెవెన్యూ అధికారులు పిడుగువేశారు. తక్షణమే గుడిసెలు ఖాళీ చేయాలని హుకుం జారీచేశారు. దీంతో పేదలు దిక్కుతోచని స్థితిలో విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మోతీనగర్ నుంచి బోరబండ వెళ్లే ప్రధాన రహదారి పక్కన సారథినగర్ వద్ద ఉన్న సుమారు 1200 గజాల ఖాళీ స్థలంలో నిరుపేదలు 35 ఏండ్ల క్రితం గుడిసెలు వేసుకున్నారు. ఖైరతాబాద్ రెవెన్యూ మండలం, యూసుఫ్‌గూడ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 128లో ఉన్న సదరు స్థలంలో 45 కుటుంబాలు నివసిస్తున్నాయి. గురువారం ఉదయం హఠాత్తుగా రెవెన్యూ అధికారులు, పోలీసులు గుడిసెల వద్దకు చేరుకున్నారు. ఆ స్థలాన్ని సర్వే చేసిన అధికారులు, ఖాళీ చేసి వెళ్లిపోవాలని గుడిసెవాసులకు హుకుం జారీ చేశారు. ‘మీరు ఉంటున్న స్థలానికి సంబంధించి ఏవైనా పత్రాలుంటే రెడీ చేసుకోండి.. మళ్లీ వచ్చి పరిశీలిస్తాం’ అంటూ రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గుడిసె అడ్రస్‌తోనే ఆధార్ కార్డులు
సారథినగర్ వద్ద ఉంటున్న గుడిసెవాసులందరికీ ఆ చిరునామాతోనే ఆధార్, ఓటరు కార్డులు జారీ అయ్యాయి. జలమండలి ద్వారా రోజుకు రెండు ట్యాంకర్లతో నీటి సరఫరా కూడా జరుగుతున్నది. అక్కడుంటున్న కుటుంబాల్లో చాలా మంది కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గుడిసెలను కాపాడాలని అధికారుల అల్టిమేటంతో ఆవేదన చెందుతున్నారు.
రంగంలోకి బయటి వ్యక్తులు
గుడిసెలున్న స్థలాన్ని రెవెన్యూ అధికారులు సర్వే చేసి వెళ్లిన కాసేపటికి కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఆ స్థలం తమదేనని, తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని తేల్చిచెప్పారు. భూముల ధరలు భారీగా పెరగడంతో ఆ స్థలంపై కొందరి కన్నుపడిందని, అందుకే భూమిని దక్కించుకునేందుకు స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సగం జీవితం ఈ గుడిసెలనే గడిచింది
35 ఏండ్ల కింద పొట్ట చేత పట్టుకొని వచ్చినం. ఎండ, వాన, చలికి తట్టుకొని ఉంటున్నం. నాకిప్పుడు 75 ఏండ్లు. సగం జీవితం ఈ గుడిసెల గడిచింది. చాలా దినాల కింద నా భర్త చనిపోయిండు. గుడిసె ఖాళీ చెయ్యాలని చెప్పి వెళ్లిన్రు. యాడికి వెళ్లాలె. ఎట్లుండాలె. ఏ తోవ చూపియ్యకుండ వెళ్లిపొమ్మంటే ఎట్లా.
-జిన్నాబాయి, సారథినగర్.
ఈడనే పుట్టిన..
నాకు ఊహ తెలియనప్పుడు మా అమ్మ, నాన్న ఇక్కడికి వచ్చి గుడిసె వేసుకున్నరు. నేను ఇదే గుడిసెల పుట్టిన. నాకు పెండ్లి అయింది. పిల్లలు కూడా అయినారు. అందరం ఒక్క గుడిసెలోనే ఉంటున్నం. పూట గడవటం చాల కష్టంగ ఉన్నది. కూలీ పని చేసుకుని బతుకుతున్నం. గరీబోళ్లని సర్కారోళ్లు ఆదుకోవాలె కాని.. కష్టాల పాలు చేస్తే ఎట్ల?
– నీలమ్మ, సారథినగర్