సిటీబ్యూరో, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): మనం నిత్యం హోటళ్లు, బేకరీలు, మాళ్లలో కొనుగోలు చేసి తింటున్న ఆహార పదార్థాలు అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూడటానికి ఆకర్షణీయంగా, రుచిగా ఉండేందుకు తినుబండారాలు, ఆహార ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన సింథటిక్ రంగులను విచ్చలవిడిగా వాడుతున్నారు. కొంతమంది తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు స్వార్థంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కృత్రిమ రంగులను కలపడం వల్ల నాసిరకం ఆహార పదార్థాలు బహిరంగ ప్రదేశాలు, హోటళ్లలో అమ్ముతూ ప్రజలను వ్యాధుల బారిన పడేలా చేస్తున్నారు.
ఈ సింథటిక్ రంగులను ఎక్కువగా పెట్రోలియం ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. వీటిని ఆహార ఉత్పత్తుల రంగు, రుచి కోసం వాడటం వల్ల అనేక ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తున్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వీటిని విచ్చల విడిగా వాడుతున్నారు. ఆహార భద్రత అధికారులు నిత్యం తనిఖీలు చేస్తున్నా.. చిన్న చిన్న కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే సింథటిక్ రంగులను పూర్తిగా నిషేధించాలని నగర ప్రజలు కోరుతున్నారు.
కల్తీ పదార్థాల విక్రయం..
గ్రేటర్ హైదరాబాద్‌లో చిన్నచిన్న హోటళ్ల నుంచి అత్యంత ఖరీదైన రెస్టారెంట్ల దాకా కృత్రిమ రంగులను వాడుతున్నారు. వాటి వాడకంతో నాసిరకం ఆహార పదార్థాలైనా ఆకర్షణీయంగా కనిపిస్తూ, రుచిగా ఉండటంతో వినియోగదారులు ఎగబడి తింటున్నారు. స్వీట్లు, కొన్నిరకాల కేకులు, కూల్ డ్రింకులు, వేపుళ్లు, మసాలాల్లో ఆర్టిఫీషియల్ రంగులను వాడుతున్నారు. స్వీట్లు, కేకులు, మాంసాహారానికి ఎరుపు రంగు రావడానికి వీటిని వాడుతున్నారు.
చిప్స్, పాప్‌కార్న్ వంటి వాటికి పసుపు రంగు కోసం, పీచు మిఠాయి ఐస్‌క్రీమ్, సూప్‌లు, బఠానీ లాంటి వాటికి నీలం రంగు కోసం ఈ రంగులను కలుపుతున్నారు. ఉడికించిన ఆహార పదార్థాలతో పాటు పసుపు, కారం, టీ పొడుల్లో కూడా వీటిని విచ్చలవిడిగా వాడుతున్నారు. సింథటిక్ రంగుల స్థానంలో క్యారెట్, బీట్రూట్, గోధుమ గడ్డి, కుంకుమ పువ్వు, పసుపు వాడటం వల్ల రంగుతో పాటు రుచి కూడా వస్తుందని ఆహార భద్రత నిపుణులు చెబుతున్నారు.
అరికట్టడంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విఫలం..
కల్తీ, ప్రమాదకర ఆహార పదార్థాల నుంచి ప్రజలను రక్షించేందుకు ఎన్నో చట్టాలున్నా..వాటిని కొందరు వ్యాపారులు వారి స్వప్రయోజనాల కోసం తుంగలో తొక్కుతున్నారు. ఆహార భద్రత అధికారులు సైతం అలాంటి ఉల్లంఘనలను చూసీచూడనట్లుగా వ్యవహిస్తుండటంతో ఆర్టిఫీషియల్ కలర్ల వాడకం విపరీతంగా పెరిగిపోతున్నది. ఆహార కల్తీ నిరోధక చట్టం-1954, ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006, ఆహార ఉత్పత్తుల ప్రమాణాలు, ఆహారం రంగు, రుచి, నిల్వ కోసం కలిపే పదార్థాల నియంత్రణ నిబంధనలు-2011 వంటి చట్టాలన్నీ కల్తీ, ప్రమాదకర ఆహార పదార్థాలను అరికట్టేందుకు రూపొందించినవే.
ప్రతి ఆహార ఉత్పత్తుల సంస్థలు, హోటళ్లు, బేకరీలు ఈ చట్టాలను పాటించాల్సిందే. లేకపోతే వాటిపై చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రేటర్ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిత్యం తనిఖీలు చేసి కల్తీ, సింథటిక్ రంగుల వాడిని ఆహార పదార్థాలను గుర్తించినా.. చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయని తెలుస్తున్నది. కొన్ని హోటళ్లను తాత్కాలికంగా మూసివేసినప్పటికీ యజమానులు అధికారులను మ్యానేజ్ చేస్తూ మళ్లీ తెరుస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కృత్రిమ రంగులతో వ్యాధులు..
సింథటిక్ రంగులు వాడిన నాసిరకం, కల్తీ ఆహారాన్ని తిని ప్రజలు ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు. కృత్రిమ రంగులను వాడిన ఆహార పదార్థాలను ఎక్కువకాలం తినడం వల్ల మనుషుల్లో క్యాన్సర్ సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లల్లో హైపర్ యాక్టివ్, అలర్జీలు, పురుషుల్లో మూత్రనాళ సమస్యలతో పాటు జీర్ణకోశ వ్యాధులు, ఉబ్బసం వంటివి తలెత్తుతున్నాయి.
సింథటిక్ రంగులు స్త్రీలలో రుతు సంబంధ సమస్యలు, మైగ్రేన్ తలనొప్పి, కాలేయ వ్యాధులు తలెత్తతున్నాయని హెచ్చరిస్తున్నారు. సింథటిక్ రంగులు పూసిన ఆహార పదార్థాలను వాడకుండా సహజసిద్ధంగా తయారు చేసిన వాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నాయని కృత్రిమ రంగులు వాడిన ఆహారాన్ని తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.