ఎర్రగడ్డ, జూలై 16: బోరబండలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సమస్యలపై శంఖారావం’ కార్యక్రమానికి మంగళవారం విశేష స్పందన లభించింది. సైట్-3లోని ప్రొఫెసర్ జయశంకర్ కమ్యూనిటీహాలులో జరిగిన ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజల సమస్యలు ఎమ్మెల్యే మాగంటి విన్నారు. అనంతరం ప్రజలు వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను అధికారులకు అందజేశారు. రెవెన్యూ, బల్దియా, జలమండలి, పౌరసరఫరాలు, ఎలక్ట్రికల్ తదితర శాఖలకు అనుబంధంగా ఉన్న అంశాలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. వివిధ శాఖల అధికారులు కిరణ్, రామచంద్రరాజు, గిరిధర్, సరస్వతి, వేణు తదితరులు హాజరై ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే మాగంటి సూచించారు.