సిటీబ్యూరో, జనవరి 12(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పథకాల విధి విధానాలు పారదర్శకంగా ఉండాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్తో జరిగిన హైదరాబాద్ జిల్లా సన్నాహక సమావేశంలో మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ, లబ్ధిదారుల ఎంపిక, పేదల గుర్తింపు, పథకాల అమలు తీరు, విధివిధానాలను సమీక్షా సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్లు కేటాయించే క్రమంలో దరఖాస్తు చేసుకున్న వారి అర్హత విషయంలో ప్రభుత్వం కొన్ని సవరణలు చేయాలని సూచించారు. ఎల్లో ప్లేట్ ట్యాక్సీ డ్రైవర్లను ఓనర్లుగా గుర్తించడం ద్వారా ఎంతో మంది పేదలకు అన్యాయం జరుగుతున్నదన్నారు. దివ్యాంగుల జాబితాలో తలసేమియా, కీమో, డయాలసిస్ పేషంట్లకు కూడా సదరం సర్టిఫికెట్లు జారీ చేసి వారిని కూడా లబ్ధిదారులకు ఎంపిక చేయాలన్నారు.
అదేవిధంగా రేషన్ కార్డుల పంపిణీ పారదర్శకంగా ఉండాలని, రేషన్ కార్డుల్లో మరణించిన వారి పేర్ల తొలగింపు, కొత్తవారి నమోదు ప్రక్రియను సులభతరం చేయాలన్నారు. అధికారుల అలసత్వం, సమన్వయ లోపంతో జియో ట్యాగింగ్ లేకుండానే అధికారులు కూర్చున్న చోటే ప్రజలను రమ్మని ఫొటోలను సేకరించడం సరికాదన్నారు. ప్రణాళికాబద్ధంగా ఇంటింటికీ తిరిగి నమోదు చేసుకోవాలని మంత్రిని కోరారు. అదేవిధంగా వక్ఫ్ బోర్డు స్థలాల్లో ఉంటున్న లబ్ధిదారుల పేర్లను కూడా జాబితాలో చేర్చారని, వారికి కూడా పథకాలను అందించాలన్నారు.