సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకాన్ని మళ్లీ అమలు చేయాలని ప్రజాపాలన సర్కారు నిర్ణయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించి ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ తదితర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిన ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమల్లో నీరుగార్చింది. ఎట్టకేలకు 20 నెలల తర్వాత ఈ పథకం ప్రతిపాదనలకు బూజు దులిపిన జీహెచ్ఎంసీ.. మళ్లీ సీఆర్ఎంపీలో భాగంగా రెండో దశ ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
రూ. 2828 కోట్లతో 1142.54 కిలోమీటర్ల మేర రహదారులను ఐదేండ్ల పాటు ప్రైవేట్ ఏజేన్సీలకు అప్పగించనున్నారు. ఈ మేరకు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన అందించే క్రమంలో భాగంగా తొలుత జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తీసుకోనున్నారు. శనివారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ సీఆర్ఎంపీ పథకంపై సభ్యులు చర్చించి ఆమోదం తెలుపనున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయంలో గుంతలు లేని రహదారుల లక్ష్యంగా వాహనదారులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రధాన రహదారుల నిర్వహణలో భాగంగా 510 విభాగాలుగా విభజించి తొలి విడతగా 744 కిలోమీటర్ల రహదారిని ప్రైవేట్ ఏజెన్సీలకు 2020లో నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దాదాపు రూ.1900కోట్ల మేర ఖర్చు చేసి నిర్ణీత లక్ష్యాన్ని గతేడాది అక్టోబరులోనే చేరుకున్నారు. ఈ సీఅర్ఎంపీ విధానం ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలిచింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే సీఆర్ఎంపీ మోడల్ వివరాలను తీసుకోగా.. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌కు చెందిన పలు కార్పొరేషన్లు పురపాలక శాఖను సంప్రదించారు. ఇటువంటి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రెండో దశ పతిపాదనలను పక్కన పెట్టడం, కనీసం మొదటి దశ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహణ చేపట్టకపోవడం గమనార్హం.
కాగా సీఆర్ఎంపీ మొదటి దశలో భాగంగా రోడ్ల నిర్వహణ బాధ్యతలు గత జనవరి నెలలో ఏజెన్సీల నిర్ణీత గడువు ముగిసింది. దీంతో ఫుట్‌పాత్‌ల నిర్వహణ, సెంట్రల్ మీడియన్, కెర్భ్ పెయింటింగ్, లేన్ మార్కింగ్, స్వీపింగ్, గ్రీనరీ నిర్వహణ జీహెచ్ఎంసీ చేపడుతూ వస్తున్నది. మొదటి దశతో పాటు రెండో దశ కలిపి రూ. 2828 కోట్ల రోడ్ల నిర్వహణ పనులకు పరిపాలన అనుమతి ఇవ్వాలని ప్రతిపాదనలు అందజేసింది.