సిటీబ్యూరో, మే17(నమస్తే తెలంగాణ): నగరంలో వీధుల విజువలైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ యూజర్లకు అందుబాటులో ఉన్న డేటాను అప్‌గ్రేడ్ చేస్తుండగా..తాజా స్థితిగతులకు అనుగుణంగా కొత్త గూగుల్ స్ట్రీట్ వ్యూ విజువల్‌ను వీక్షించేలా ఆప్‌గ్రేడ్ చేస్తున్నారు. గతంలో ఎంపిక చేసిన నగరాల్లో గూగుల్ స్ట్రీట్ మ్యాప్ అందుబాటులో ఉండగా..దేశంలోని మెజార్టీ ప్రాంతాలు, నగరంలో 70 శాతం మేర వీధులు స్ట్రీట్ వ్యూ పరిధిలోకి వచ్చాయి. తాజాగా మిగిలినపోయిన కొత్త రూట్లతోపాటు, రెండేళ్ల కిందట డేటాను రీషెడ్యూల్ చేసేందుకు హెడ్ మౌంటెడ్ కెమెరాతో విజువల్ సర్వే చేస్తున్నారు.
మ్యాప్ మై ఇండియా సంస్థ స్ట్రీట్ వ్యూ డేటాను క్రోడీకరించి గూగుల్‌కు అందజేయనుంది. దీనికి నగరంలో 22 మంది టెక్నికల్ సిబ్బంది నిత్యం 100 కిలోమీటర్ల ప్రయాణిస్తూ కొత్త రూట్లు, పాత దారులను అప్డేట్ చేస్తున్నారు. గూగుల్ మ్యాప్ ప్రారంభించిన కొద్ది కాలం తర్వాత స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను మొదటిసారిగా 2011లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే స్ట్రీట్ వ్యూ పేరిట చిత్రాలు సేకరించడంపై అప్పట్లో ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ టెక్నాలజీ వల్ల భద్రతాపరమైన ఇబ్బందులు ఉంటాయని 2016లో నిషేధం విధించారు. రెండేళ్ల తర్వాత స్ట్రీట్ వ్యూ ఫీచర్ అందుబాటులోకి తీసుకురాగా దేశంలోని ఎంపిక చేసుకున్న నగరాల్లోనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అప్పటి నుంచి దశల వారీగా నగరంలోనూ స్ట్రీట్ వ్యూ ఫీచర్ ఆధునీకరిస్తుండగా..లేటెస్ట్ టెక్నాలజీతో పనిచేసే హెడ్ మౌంటెడ్ కెమెరాతో వీధులను విజువలైజ్ చేస్తున్నారు.
2020లో అందుబాటులోకి వచ్చిన సమయంలో కారుపై బిగించిన 360 డిగ్రీ కెమెరాతో స్ట్రీట్ వ్యూ రికార్డు చేయగా..దాని పరిధి కేవలం ప్రధాన మార్గాలకు మాత్రమే విస్తరించి ఉందని ఆ సంస్థ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం టూవీలర్ మీద నగరంలో తిరుగుతూ సర్వే చేస్తున్నామని, దీనికి అడ్వాన్స్ టెక్నాలజీతో పనిచేసే హెడ్ మౌంటెడ్ కెమెరాలను 360 డిగ్రీల పరిధిలో వినియోగిస్తున్నట్లుగా వివరించారు. మ్యాప్ మై ఇండియా సంస్థకు చెందిన 22మంది స్ట్రీట్ మ్యాపింగ్ విజువల్ సర్వే చేస్తున్నారని.. ఒక్కొక్కరు రోజుకు 100 కిలోమీటర్ల ప్రయాణిస్తూ చిన్న చిన్న గల్లీలను కూడా స్ట్రీట్ వ్యూ ద్వారా చేరుకునేలా ఆప్‌గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. విజువల్ సర్వే చేసిన రికార్డులను మరో మూడు నెలల తర్వాత అందుబాటులోకి వస్తుందన్నారు.