అబిడ్స్, జనవరి 25: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)లో సందర్శకుల సండే సందడి నెలకొంది. ప్రతి సంవత్సరం నుమాయిష్‌ను జనవరి ఒకటో తేదీన ప్రారంభించి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాలు కొనసాగిస్తారు. వరుసగా సెలవులు రావడంతో నగర నలు మూలల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి సందర్శకులు భారీగా తరలి వచ్చారు. శనివారం నాటికి దాదాపు పదిన్నర లక్షల మంది సందర్శకులు సందర్శించగా ఆదివారం ఒక్క రోజే దాదాపు ఎనభై వేల వరకు సందర్శకులు సందర్శించి స్టాళ్లలో కొనుగోళ్లను చేపట్టారు.
అమ్యూజ్మెంట్ పార్క్‌లో ఏర్పాటు చేసిన రైడ్స్ ఎక్కి ఆనందంగా గడిపారు. ఫుడ్ కోర్టులు, స్టాల్లు సందర్శకులతో కిక్కిరిసి పోయాయి. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు కావడంతో సందర్శకుల సంఖ్య భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనలతో పాటు విక్రయాలు, వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు గాను ప్రత్యేకంగా స్టాల్లను ఏర్పాటు చేశాయి. మెప్మాబజార్లో స్వయం సహాయక సంఘాల వారు స్టాల్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు విక్రయాలు చేపడుతున్నారు.
స్టాళ్లలో సందడి…
నుమాయిష్‌లో నెలకొల్పిన స్టాళ్లలో సందడి నెలకొంది. ఎగ్జిబిషన్ సందర్శనకు వచ్చే సందర్శకులు నుమాయిష్‌లోని స్టాళ్లలో కొనుగోళ్లను చేపడుతున్నారు. లక్నో చికెన్, వివిధ రాష్ర్టాలకు చెందిన వస్ర్తాలు, జమ్మూకాశ్మీర్‌కు చెందిన డ్రై ఫ్రూట్స్‌తో పాటు పలు గృహోపకరణాలు, గృహోపకరణాలను విక్రయించే కంపెనీలు స్టాల్లను ఏర్పాటు చేయడంతో పాటు డిస్కౌంట్ ధరలకు విక్రయాలు చేపడుతున్నాయి.
సందర్శకుల తాకిడి పెరిగింది
నుమాయిష్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో ఎగ్జిబిషన్‌ను సందర్శించేందుకు సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు. నుమాయిష్ సందర్శనకు వచ్చే వారి కోసం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం. ప్రతి నిత్యం సందర్శకులను అలరించేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. వీక్షించి సంబుర పడుతున్నారు.
– సుఖేశ్ రెడ్డి, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాద్యక్షుడు
అడుగడుగునా నిఘా పెంచాం
నుమాయిష్‌లో అడుగడుగునా ని ఘా ఏర్పాటు చేశాం. తమ సొసైటీ వలంటీర్స్ మేనేజింగ్ కమిటీ ద్వారా వలంటీర్లు మైదానంలో తిరుగుతూ ప్రత్యేక నిఘా పెడుతున్నారు. సీసీ కెమెరాలు, ప్రధాన ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక మెటల్ డిటెక్టర్ల ద్వారా సందర్శకులను తనిఖీ చేసి పంపిస్తున్నాం. సెలవులు రావడంతో తాకిడి పెరిగింది
– రాజేశ్వర్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి