బంజారాహిల్స్ : వ్యాపారి ఇంట్లోని పూజగదిలో సామగ్రి చోరి అయిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 43 లో నివాసం ఉంటున్న వై.కల్యాణ్ స్వరూప్ అనే వ్యాపారి ఇంట్లోకి ఈనెల 9న తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించాడు.
పూజగదిలోని వెండి వస్తువులను, కొంత నగదును తస్కరించాడు. ఉదయం పూజగదిలోకి వచ్చిన కల్యాణ్ స్వరూప్ అక్కడ ఉండాల్సిన వస్తువులు మాయమయిన విషయాన్ని గమనించాడు. ఈ మేరకు బాధితుడు గురువారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.