సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం వరకు పనులు పూర్తి చేసుకున్న మేడిపల్లిలోని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ భవనం మంగళవారం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. 2019లో అప్పటి సీఎం కేసీఆర్ రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు శాశ్వత కార్యాలయం కోసం మేడిపల్లిలో 53 ఎకరాలు కేటాయించారు. 2023 వరకు ఈ భవనం పనులు 90 శాతం పూర్తయ్యాయి. సుమారు రూ.76 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. అయితే భవనం పూర్తయ్యే సమయానికి ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 10 శాతం పనులు పూర్తి చేసేందుకు సుమారు రెండున్నర సంవత్సరాల సమయం పట్టింది. కాగా, రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ను పునర్విభజన చేసిన ప్రభుత్వం.. రాచకొండ పేరును తొలగించి.. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌గా నామకరణం చేసింది.
ఇప్పుడు మేడిపల్లిలోని ఈ భవనం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు శాశ్వత భవనంగా సేవలు అందించనున్నది. అయితే ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ శాశ్వత భవనానికి మీర్ఖాన్పేట్లో శంకుస్థాపన చేస్తుండగా, అక్కడే మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించిన భవన ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నట్లు సమాచారం. దీంతో పాటు కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయం, గచ్చిబౌలిలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, ఆక్టోపస్లోని నూతన భవననాలకు సంబంధించిన శిలాఫలాలనూ ప్రారంభించి, ఆయా భవనాలను వర్చువల్‌గా ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చించుకుంటున్నారు. డీజీపీ శివధర్‌రెడ్డితో పాటు ఫ్యూచర్‌సిటీ కమిషనర్ సుధీర్‌బాబు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ భవనాలన్నీ ఒకేసారి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఫ్యాబ్‌సిటీలో ఫ్యూచర్‌సిటీ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం
రంగారెడ్డి, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల తరహాలోనే ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌ను రూపొందిస్తామని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తుక్కుగూడ సమీపంలోని ఫ్యాబ్‌సిటీలో ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీ నిర్మాణానికి అధిక ప్రాధాన్యమి స్తున్నదని.. ఇందుకు అనుగుణంగానే ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్నూ నిర్మిస్తామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసుల సేవలు ఎంతో అమోఘమని కొనియాడారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కార్యకలాపాల కోసం మౌలిక వసతులతోపాటు భవన నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.
అందులో భాగంగానే కమిషనరేట్ కార్యాలయం కోసం తాత్కాలిక భవనాన్ని సిద్ధం చేశామన్నారు. ఈ భవనం సెంట్రల్ లొకేషన్లో ఉండడంతో ప్రజలకు అందుబాటులో ఉంటుందని, అలాగే, ఓఆర్ఆర్ పక్కనే సర్వీస్ రోడ్డును ఆనుకొని ఉండడంతో రవాణా పరంగా ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. అదే సమయంలో మీర్ఖాన్పేట సమీపంలో 24 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కోసం కేటాయించిందని, దాని నిర్మాణానికి రూ. 25 కోట్లనూ మంజూరు చేసిందన్నారు. త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభించి.. ఒకటి రెండేండ్లలో పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, జాయింట్ సీపీ చందనాదీప్తి, మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శివరాం, షాద్‌నగర్ డీసీపీ శిరీష, చేవెళ్ల డీసీపీ యోగేశ్‌గౌతం, అదనపు డీసీపీ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.