అతడి పేరు రమేశ్. ఆటో డ్రైవర్. కాచిగూడలోని ఓ షోరూంలో ఆటో కోసం దరఖాస్తు ఇచ్చాడు. ఆ దరఖాస్తు వివరాలు అప్లోడ్ చేయడానికి ఆ షోరూం నిర్వాహకులు రూ.5వేలు వసూలు చేశారు. ఫైనాన్స్ చేయాలంటే రూ.10వేలు ప్రాసెస్ ఫీజు అంటూ బెంబేలెత్తించారు. దీనికి తోడు ఆటో ధర రూ.2.40 లక్షలు అయితే రూ. 3.10 లక్షలు కట్టాలన్నారు. ఇన్వాయిస్ మాత్రం రూ. 2.40 లక్షలకే ఇస్తామని చెప్పారు. అదేంటని అడిగితే ఇక్కడ ఇంతేనని ఎవరికీ ఫిర్యాదు చేసినా ఏమీ చేయలేరంటూ బెదిరించారు. అదనంగా రూ. 85వేలు చెల్లించలేని అతడు అన్ని అర్హతలు ఉన్నా షోరూం నుంచి వెనుతిరిగి వెళ్లిపోయాడు.
“షోరూం డీలర్లు ఆటో డ్రైవర్ల దరఖాస్తులను స్వీకరించడానికి ఎటువంటి డబ్బులు వసూలు చేయకూడదు. ఇన్వాయిస్ ఆటో ధర కన్నా అదనంగా డబ్బులు తీసుకోవడానికి వీలు లేదు. అన్ని అర్హతలు ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ వివరాలు అప్లోడ్ చేయాలి. నిబంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయి.” అంటూ ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసింది. కానీ క్షేత్రస్థాయిలో షోరూం నిర్వాహకులు సర్కార్ ఆదేశాలను పాటించడం లేదు.
సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ) : నగరంలోని షోరూం నిర్వాహకులు ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఉపాధి కోసం ఆటో నడుపుకుందామనుకున్న డ్రైవర్లకు ఆటో కొనుగోలు పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఇటీవల ప్రభుత్వం నగరంలో 20వేల కొత్త ఆటోలకు అనుమతినిచ్చింది. ఇందులో పదివేలు సీఎన్జీ, పదివేలు ఎల్పీజీ ఉన్నాయి. అయితే ఆటోల కొనుగోలు ప్రక్రియను ఆర్టీఏ అధికారులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఆ బాధ్యతను షోరూం డీలర్లకు అప్పగించింది. దీంతో డీలర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఇన్వాయిస్ ప్రకారం ఒక్క ఎల్పీజీ ఆటో ధర రూ.2.30 లక్షలు ఉండగా రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారు. అదనంగా రూ.70 వేలు దోచుకుంటున్నారు. ఇదేంటని అడిగితే సంబంధిత ఆటో డ్రైవర్ల వివరాలను డీలర్లు తీసుకోవడం లేదు. దీనిపై రవాణా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆటో విక్రయాలతో షోరూం నిర్వాహకులు 140 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి తెరలేపారు.
తప్పుకున్న ఆర్టీఏ..
కొత్త ఆటోల కొనుగోలుకు సంబంధించి విధి విధానాలను ప్రవేశపెట్టడంతో పాటు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్‌కు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత రవాణా శాఖదే. కానీ ఆ శాఖ డీలర్ల ముందు నిలబడలేకపోతున్నది. ఆటోలు ఎవరికీ అమ్మాలి? ఎవరికీ ఇవ్వకూడదనే అంశాలన్నింటినీ డీలర్లే చూసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో షోరూం డీలర్లు అడిగినంత ఇచ్చిన వారికే ఆటోలు విక్రయిస్తున్నారు. ఇప్పటికీ 30 ఆటోల వరకు విక్రయించినట్టు తెలిసింది. ప్రతీ ఒక్క ఆటోపై రూ.70వేలు అదనంగా వసూలు చేస్తున్నారని బీఎంఎస్ ఆటో సంఘం నాయకులు ఫిర్యాదులు కూడా చేశారు.
అన్ని అర్హతలు ఉన్న ఆటో డ్రైవర్ దరఖాస్తులో ఏదో ఒక కొర్రి పెట్టి వాటిని పరిశీలనకు కూడా వెళ్లకుండా ఆదిలోనే అడ్డుకుంటున్నారు. ఈ తతంగంలో కొన్ని ఆటో సంఘాల నాయకులు కూడా చేతులు కలిపారు. వారి సంఘాలకు సంబంధించిన డ్రైవర్లకు ఆటోలు ఇప్పించుకునే వెసులుబాటు కల్పించడంతో వారు నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. అర్హత గల ఆటో డ్రైవర్‌ను పక్కనపెట్టి బినామీల పేరుతో ఆటోలు కొనుగోలు చేస్తున్నారని బీఎంఎస్ నాయకులు ఆరోపించారు.
ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క సీఎన్జీ ఆటో 2.40 లక్షలు ఉండగా 3.10 లక్షలకు అమ్ముతున్నారని చెబుతున్నారు. ఎల్పీజీ ఆటో రూ.2.30 లక్షలు ఉంటే 3 లక్షలకు అమ్మేశారని వివరించారు. ఇప్పటికే మార్కెట్లోకి కొత్తగా 30 ఆటోలు బయటకొచ్చాయని పేర్కొన్నారు. ఇప్పటికే 70 శాతం ఆటోలు బుక్ అయ్యాయన్నారు. అవన్నీ నిజమైన అర్హులకే అందాయా? లేదా? అనేది కూడా తేలాలని కోరారు. ఆటో బుకింగ్‌లు అన్నీ నిలిపివేసి మళ్లీ ఆర్టీఏ అధికారుల ఆధ్వర్యంలో ప్రాసెస్ జరగాలని డిమాండ్ చేశారు.
మళ్లీ పర్యావరణ కాలుష్యమేనా?
పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వం ఓఆర్ఆర్ లోపల పెట్రోల్, డీజిల్ ఆటోలు ఉండొద్దని చెప్పింది. అన్నీ ఎలక్ట్రిక్ ఆటోలే ఉండాలని సూచించింది. కానీ అందుకు విరుద్ధంగా ఎలక్ట్రిక్ ఆటోల పర్మిట్‌కు అనుమతినిచ్చిన సర్కార్.. వాటి కొనుగోలును మాత్రం మొదలుపెట్టలేదు. కానీ పర్యావరణానికి హాని కలిగించేందుకు దోహదపడే ఎల్పీజీ, సీఎన్జీ ఆటోల కొనుగోలుకు మాత్రం ప్రారంభించింది. ఎవరి ప్రయోజనాల కోసం ఎల్పీజీ, సీఎన్జీ ఆటోల కొనుగోలు ప్రారంభించారని ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.