ఆ పోలీసు స్టేషన్లో ఎవరూ ఉండటానికి సాహసించడం లేదు. పబ్బులు, క్లబ్బులతో నిత్యం కళకళలాడుతూ ఎప్పుడూ జేబులు ఫుల్లుగా నింపుకునే పరిస్థితులు ఉన్నా ఇప్పుడు మొత్తం తారుమారైంది. ప్రముఖులతో పరిచయాలు వారి పాలిట శాపంగా మారుతున్నాయి. రెండు సంవత్సరాల్లో నలుగురు ఇన్స్పెక్టర్లు మారడం ఒక అంశమైతే.. ఆరునెలల్లోనే ముచ్చటగా ముగ్గురు ఇన్స్పెక్టర్లపై వివిధ కారణాలతో వేటు పడడంతో నగర పోలీసుశాఖలో ఆ పీఎస్‌లో ఇన్స్పెక్టర్ పోస్టింగుపై చర్చ జరుగుతోంది. ఒకప్పుడు హాట్‌సీటుగా పేరుపొందిన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ పోస్టింగు ఇప్పుడు ల్యాండ్మైన్లాగా మారిందని నాలుగు కమిషనరేట్లలో చర్చ జరుగుతోంది. తాజాగా ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ సస్పెండ్‌పై జరుగుతున్న చర్చలో ఇదే ప్రధాన అంశంగా మారింది. గతంలో స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారసులు తీసుకునే దగ్గర ఇప్పుడు ఏకంగా సీఎంవో లేదా పోలీసు బాసుల కనుసన్నల్లోనే పోస్టింగులు, ఊస్టింగులు జరుగుతున్నాయని, ఈ స్టేషన్‌కు రాజకీయ గ్రహణం పట్టిందంటూ స్థానికులు అంటున్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : నగరం నడిబొడ్డున హాట్‌ఫేవరేట్ సెంటర్‌గా పేరున్న జూబ్లీపీఎస్కు రావాలంటేనే పోలీసు అధికారుల్లో వణుకు పుడుతోంది. పోస్టింగు వచ్చినప్పటినుంచి ఎప్పుడేం జరుగుతుందో తెలియక అనుక్షణం బిక్కుబిక్కుమంటూ స్టేషన్లో కాలంగడుపుతున్నారు. సీఎం నివాసముంటున్న ప్రాంతం కావడంతో నిరంతరం బందోబస్తులతోనే తీరికలేని పరిస్థితుల్లో కూడా తమ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా తెలియక ఆందోళనలో విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. అందుకే గతంలో ఈ పోలీస్‌స్టేషన్‌లో డ్యూటీ అంటే కాసుల పంట పండుతుందని భావించి రకరకాల మార్గాల్లో పైరవీలు చేసి పోస్టింగులు దక్కించుకున్న పలువురు అధికారులు అత్యంత అవమానకరమైన రీతిలో తమ గాడ్ఫాదర్ల చేతిలోనే కంఠం తెగాల్సిన పరిస్థితి రావడంతో బెంబేలెత్తుతున్నారు.
నిన్న శ్రీనివాసరెడ్డి, నేడు ముత్తుయాదవ్, అంతకుముందు వెంకటేశ్వర్‌రెడ్డి, ఆ మధ్యలో పోస్టింగు దక్కించుకుని బాధ్యతలు తీసుకోని సైదులు.. ఇలా నలుగురు ఇన్స్పెక్టర్లు రెండేళ్లలో మారిపోయారు. ఇందులో వెంకటేశ్వర్‌రెడ్డి కొంత ఎక్కువ సమయం పనిచేసినా మధ్యలో సైదులుకు పోస్టింగ్ ఇవ్వడంతో కొంత సందిగ్దత ఏర్పడింది. ఆ తర్వాత వెంటనే ఆయన పోస్టింగు రద్దు చేసి తిరిగి వెంకటేశ్వర్‌రెడ్డికే బాధ్యతలు అప్పగించారు. వెంకటేశ్వర్‌రెడ్డి ఫిబ్రవరి వరకు పనిచేసిన తర్వాత ఆయన స్థానంలో శ్రీనివాసరెడ్డికి పోస్టింగు ఇచ్చారు.
అయితే ఈ ఇన్స్పెక్టర్ కమిషనరేట్‌లోని పెద్ద మనిషికి అత్యంత ఆత్మీయుడు కావడంతో ఆయన వ్యక్తిగత వ్యవహారాలు వివాదాస్పదమే అయినా అవన్నీ తూచ్మంటూ పక్కకుపోయి శ్రీనివాసరెడ్డి పోస్టింగు కాస్ట్లీగా మారింది. ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి విషయంలో ఓ మహిళ చేసిన ఫిర్యాదు, ఆరోపణల నేపథ్యమే కాకుండా పోస్టింగు కోసం తాను డబ్బులు ఇచ్చానంటూ కొన్ని ఆధారాలు ఇవ్వడంతో పోలీసుశాఖలోనే శ్రీనివాసరెడ్డి పోస్టింగు తమ శాఖకే తలవంపులు తెచ్చిందంటూ సీనియర్లు కొందరు వ్యాఖ్యానించారు. ఈ ’మనీ మహిళ’ వ్యవహారం రచ్చకెక్కడంతో శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నిమిషాల వ్యవధిలోనే ..
శ్రీనివాసరెడ్డి వ్యవహారంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న నగర ఉన్నతాధికారులు తర్వాత పోస్టింగు విషయంలో జాగ్రత్త పడకుండా నిమిషాల వ్యవధిలోనే తమకు ఆంతరంగికుడుగా ’సాగుబడి’కి సహకరిస్తున్న ఆఫీసరు ముత్తుయాదవ్ను రాజేంద్రనగర్ నుంచి తీసుకొచ్చి జూబ్లీహిల్స్‌లో పోస్టింగు ఇచ్చారు. కాగా వచ్చిన రోజే సుమంత్ వ్యవహారం ఆయన దృష్టికి వచ్చినప్పుడు తన బాస్‌కు ఈ వివరాలు చెప్పడంతో ఆయన సూచనల మేరకు సుమంత్‌పై ఫిర్యాదును తేలికగా తీసుకోమన్నారని, తీరా కొండాసుస్మిత సీఎం రేవంత్‌పై వ్యాఖ్యలు చేసిన అనంతరం మళ్లీ సీరియస్‌గా కేసు చేయాలని చెప్పి ఫిర్యాదుదారును పిలిపించి వ్యవహారం నడిపించడంలో తన తప్పేం లేదంటూ ఆ ఇన్స్పెక్టర్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది.
ఈ మొత్తం ఎపిసోడ్లో తాను పెద్దసార్లు చెప్పినట్లే చేశానని, తనకేం తెలియకుండా కేవలం మూడువారాల్లోనే తనను బలిపశువును చేయడంపై ఆయన బాధపడుతున్నట్లు ఆయన బ్యాచ్‌మెట్లు చెప్పుకుంటున్నారు.పోస్టింగుల సమయంలో జూబ్లీహిల్స్ పీఎస్‌కు ఇన్స్పెక్టర్ను వేసే సమయంలో అక్కడకు ఎవరిని వేయాలనే దిశగా నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించి సమర్థతకు పెద్దపీట వేస్తూ పోస్టింగులు ఇచ్చేవారు. అయితే అటువంటి సమర్థులను వారి కాలం పూర్తయిన తర్వాత బదిలీలు చేసిన సందర్భాలే ఎక్కువ కాగా.. రెండేళ్లుగా పోస్టింగు సమయంలో చూస్తున్న సమర్థత తరువాత పనికిరాకుండా పోయిందా అంటూ ఇన్స్పెక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టింగుల విషయంలో తమకు అండగా నిలిచిన ఉన్నతాధికారులే ఆ తర్వాత తమ పీక కోసేస్తుంటే ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని వారు అంతర్గతంగా తమ సహచరులతో చెప్పుకుంటున్నట్లు తెలిసింది.