అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం.. ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోవడం అధికార యంత్రాంగానికి అలవాటుగా మారిపోతున్నది. ఫైర్ యాక్సిడెంట్లను నివారించడంలో ఘోరంగా వైఫల్యం చెందుతున్నది. ఫలితంగా విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అగ్నిప్రమాద ఘటనల్లో 163 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఒక్క హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే గత మే నెల నుంచి ఈ ఏడాది జనవరి వరకు జరిగిన ప్రమాదాల్లో 68 మంది మృతి చెందారు. నాంపల్లి ఘటన మరువక ముందే తాజాగా విజయనగర్ కాలనీలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. వేసవి కాలం రాకముందే ఇలా అగ్నిప్రమాదాల తీవ్రత పెరుగుతుండడంపై నగరవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
– సిటీబ్యూరో
గతేడాది చార్మినార్ ప్రాంతంలో గుల్జార్ హౌస్‌లో జరిగిన ప్రమాదంలో 17 మంది, పటాన్చెరు పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 46 మంది, తాజాగా నాంపల్లిలో ఐదుగురు మృతువాత పడ్డారు. ఇరుకైనా గల్లీలు, అంతర్గతంగా విద్యుత్ వైరింగ్ సరిగ్గా లేకపోవడం, సామర్థ్యాన్ని మించి విద్యుత్ వినియోగం, విద్యుత్‌లో హెచ్చు తగ్గులు, విద్యుత్ వినియోగం పెరగడంతో ఒత్తిడి పెరిగి ఆయా సామగ్రిలు, వైరింగ్ కాలీపోవడంతో ప్రమాదాలు సంభవించాయని అప్పట్లో అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు.. పాత భవనాలపై దృష్టి పెడుతామంటూ చెబుతూ, ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. గుల్జార్ హౌజ్ వద్ద జరిగిన ప్రమాదం తరువాత వేగవంతంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకొని ఉంటే తాజాగా నాంపల్లిలో పాత భవనంలో అగ్ని ప్రమాదం జరిగి ఉండేది కాదని సామాన్య ప్రజలు పేర్కొంటున్నారు.
గత ఏడాది మే నెలలో గుల్జార్ హౌజ్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో 17 మంది మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అంటూ అధికారులు అప్పట్లో చెప్పారు. ఈ విషయం జరుగగానే పాత భవనాల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం హడావుడి చేసింది. ఆ తరువాత విషయాన్ని మరిచిపోయింది.
జూన్‌లో పాశమైలారంలోని పారిశ్రామిక వాడలోని సిగాచి ఫార్మషూటికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 46 మంది వరకు కార్మికులు మృత్యువాత పడ్డారు. 30 మందికిపైగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలో సరైన ప్రమాద నివారణ చర్యలు చేపట్టకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపణలు వచ్చాయి.
నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఇక్కడ కూడా షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం సంభవించిందని అధికారులు పేర్కొంటున్నారు.
వేసవిలో ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. ఫర్నిచర్ దుకాణాలు, సోపాలు తయారు చేసే చోట, కెమికల్ డబ్బాలున్న చోట, మండే స్వాభావం ఉండే పరికరాలు నిల్వ చేసే ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అప్రమత్తతోనే ప్రమాదాలను నిలువరించడం, ప్రమాదం జరిగితే ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా వెంటనే చర్యలు చేపట్టడం వంటివి చేయాలి. అయితే ప్రజల్లో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. ప్రధానంగా అగ్నిమాపక శాఖ ఈ విషయంపై విస్త్రతంగా ప్రచారం చేయాల్సిన అవసరముంది.
సుల్తాన్‌బజార్, జనవరి 27: విజయనగర్ కాలనీలోని ఐటీఐ గిల్డ్‌లోని కార్ మెకానిక్ షాప్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని మాపక శాఖ అధికారులు నలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేసినట్లు నాంపల్లి ఇన్స్పెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. డెంటింగ్, పెయింటింగ్‌కు చెందిన వస్తువులు పూర్తిగా కాలిపోయి ఆస్తి నష్టం జరిగిందన్నారు. హనుమాన్‌టేక్డీలోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో చిమ్నీ పేలి అక్కడే ఉన్న ఫర్నిచర్ స్వల్పంగా కాలిందని సుల్తాన్‌బజార్ ఎస్ఐ వేణు వెల్లడించారు.