Telangana Police |సిటీబ్యూరో: వృత్తిలో రాణించాలంటే గాడ్ ఫాదర్ సపోర్టు ఉండాల్సిందే. లేకుంటే కిందిస్థాయి సిబ్బంది కూడా మాట వినరు. సీనియర్లు అసలు పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితులతో మానసిక వేధింపులకు గురవుతున్న కొందరు అధికారులు..బలవన్మరణం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు ఆత్మహత్య ఘటనే నిదర్శనమని పోలీస్ శాఖలో కొందరు పేర్కొంటున్నారు. ఎస్ఐ శ్రీరాములు తన ఆత్మహత్యకు గల కారణాన్ని వివరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పోలీస్ డిపార్ట్మెంట్లో చర్చనీయాంశమైంది. ఏదైనా సమస్య వచ్చిన వెంటనే ఆదుకునేందుకు ఒక గాడ్ ఫాదర్ కావాలి. గాడ్ ఫాదర్ ఉంటే అనుకున్న స్థానంలో పోస్టింగ్ వస్తుంది. పనిచేయకపోయినా గాఢ్ ఫాదర్ ఉంటే ఇంటికే జీతం వస్తుంది. ఇలా ప్రతి డిపార్టుమెంట్లో చాలా మందికి గాఢ్ ఫాదర్లు ఉంటారు. అయితే నిజాయతీగా పనిచేసే వారికి మాత్రం గాడ్ ఫాదర్లు ఉండరు. అలాంటి వారికి ఏదో చోట..అప్రాధాన్యమైన పోస్టింగ్లు ఇస్తుంటారు.
ఇవన్నీ పోలీస్ శాఖలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇది కేవలం పోలీస్ శాఖకే పరిమితం కాలేదని, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు శాఖల్లోనూ ఇదే ద్వంద్వ నీతి ఉంటోందని పలువురు పేర్కొంటున్నారు. గాడ్ ఫాదర్ లేనంత మాత్రానా.. తమ పై అధికారి పట్టించుకోనంత మాత్రానా ప్రాణాలు తీసుకోవద్దని, సమస్య ఉంటే.. బయటకు చెప్పి ఇతరులను ఒప్పించే ప్రయత్నం చేసి గెలువాలని, ఆత్మహత్యల జోలికి వెళ్లొద్దని పలువురు సూచిస్తున్నారు.