హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన కార్నివాల్లో స్టేజీ షో, వింటేజ్ కార్ షో, యూత్ పార్లమెంట్, బుక్ రీడింగ్ కార్యక్రమాలు సందర్శకులను ఆద్యంతం ఆకట్టుకున్నాయి.
– సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ)
హెచ్‌పీఎస్ శతాబ్ది ఉత్సవాలు చిరకాలం గుర్తిండిపోయేలా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొని తాము చదువుకున్న పాఠశాలలో, గడిపిన మధురానుభూతులను సన్నిహితులతో పంచుకుంటూ సరదాగా గడుపుతున్నారు. సోమవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 8గంటల వరకు నిర్వహించిన కార్నివాల్లో స్టేజీ షో, వింటేజ్ కార్ షో, యూత్ పార్లమెంట్, బుక్ రీడింగ్ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
– సిటీబ్యూరో, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ)
ఒక క్రూజ్ (ఓడ)లో సముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా ఆకస్మికంగా నీటిలో కుంగడం మొదలైంది.. ప్రయాణికులందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పుడెలా? ఈ మహా సముద్రం నుంచి తప్పించుకొనేదెలా? అంటూ స్టోరీ టెల్లింగ్ మొదలు పెట్టాడు ఓ విద్యార్థి.
పాఠశాల నుంచి పిక్నిక్ కోసం ఓ అడవి అంచుకు వెళ్లారు విద్యార్థులు.. అందరూ అక్కడ పోగైన తర్వాత లంచ్‌కు ఉపక్రమించారు. ఇంతలో అటునుంచి పెద్దపులి గాండ్రింపులతో విద్యార్థులతోపాటు టీచర్లంతా హడలెత్తిపోయారు. ఇప్పుడేం చేద్దాం.. అంటూ ఓ విద్యార్థిని తన రీడింగ్ బుక్ (స్టోరీ బుక్) నుంచి సేకరించిన అంశాలను చెప్పసాగింది.
హోరెత్తించే డీజే పాటలకు స్టెప్పులతో కార్నివాల్లో స్టేజీ షో ఉల్సాసంగా సాగింది. సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సాంప్రదాయక నృత్యప్రదర్శనలు చూపరులను మంత్రముగ్దులను చేశాయి. అదేవిధంగా ఫుడ్ కోర్టులు, ప్లే జోన్, మారథాన్ నిర్వహించారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వంటకాలు సందర్శకుల నోరూరించాయి. ట్రెడిషనల్, వెస్ట్రన్తోపాటుగా నిజాం కాలం నాటి ఆహార పదార్థాలు ఆకట్టుకున్నాయి. సోమవారం మొదలైన కార్నివాల్ వేడుకలు ఈనెల 27తో ముగియనున్నాయి. అప్పటివరకు శతాబ్ది ఉత్సవాలను చిరకాలం గుర్తిండిపోయేలా నిర్వహిస్తున్నామని హెచ్‌పీఎస్ సొసైటీ ప్రెసిడెంట్ గుస్తీ నోరియా తెలిపారు.
శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హెచ్‌పీఎస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బుక్ రీడింగ్ కార్యక్రమంలో అనేక అంశాలను వెల్లడించారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలో కూడా విద్యార్థులు తమకు తాముగా వివరించారు. ప్రాథమిక స్థాయిలోనే ఇంత సాహసాలతో కూడిన ఆలోచనలు నేర్పిస్తే.. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను నిర్భయంగా ఎదుర్కొని పరిష్కరించే వీలుంటుందని సందర్శకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బుక్ రీడింగ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తాము సాధించే విషయాలను తెలిపారు.
“స్పీకర్ మేడమ్.. ఆయామ్ ద రిప్రజంటేటివ్ ఆఫ్ కర్ణాటక స్టేట్. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. పొంచి ఉన్న ఉగ్రవాదం, దేశ భద్రతను సవాల్ చేస్తున్నది. నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం, ఉపాధి లేకుండా చేస్తున్నాయి. ఇలా విద్యా, ఉద్యోగ, వైద్య సంక్షేమాన్ని అందించే పాలసీలను పకడ్బందీగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది” అంటూ విద్యార్థులు చేసిన ప్రసంగం అబ్బురపరిచింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన యూత్ పార్లమెంట్లో విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు.
నిరుద్యోగం, టెక్నాలజీ, రక్షణ రంగం, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, మౌలిక వసతులు, రవాణా వ్యవస్థ వంటి అంశాలపై పార్లమెంట్ ప్రవర్తన నియమావళి తరహాలో విద్యార్థులు పాల్గొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ, పార్లమెంట్ సభ్యులను తలపించారు. పార్టీల వారీగా, రాష్ర్టాల వారీగా యూత్ పార్లమెంట్లో పాల్గొని నిర్దేశిత అంశాలను చర్చించారు. 8-10వ తరగతి చదువుతున్న 150 మంది విద్యార్థులు పాల్గొనగా, ఇందులో ఒకరు స్పీకర్ బాధ్యతను నిర్వర్తించారు. ఉపాధ్యాయులు, సీనియర్ విద్యార్థుల సమక్షంలో నిర్వహించిన పార్లమెంట్ సమావేశాలు పేరెంట్స్, సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వింటేజ్ కార్ షో సందర్శకులను మంత్రముగ్ధులను చేసింది. తీరొక్క కార్లతో పాఠశాల ప్రాంగణంలో సందడి నెలకొంది. కార్ల వద్ద ఫొటోలు, సెల్ఫీలతో సందర్శకులు సందడి చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వింటేజ్ కార్ల ప్రదర్శనలో 1923 నుంచి మొదలుకొని 1964వరకు ఆయా మాన్యుఫాక్షరింగ్ సంస్థలకు చెందిన కార్లు ఎగ్జిబిషన్లో దర్శనమిచ్చాయి.
వింటేజ్ ఎగ్జిబిషన్లో షాదాన్ గ్రూప్ కార్లు సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక్కడికి వచ్చిన కార్లలో 26 రకాల వింటేజ్లను ప్రదర్శనలో పెట్టామని షాదాన్ ప్రతినిధి అఖిల్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కారుగా గుర్తింపు పొందిన కారును ఆస్ట్రేలియాలోని రోల్స రాయిస్ ఇంజన్‌తో తయారు చేసినట్లు వెల్లడించారు. ఇది 1954లో డోడ్జ్ పేరుతో బయటకి వచ్చిందని తెలిపారు. అయితే అన్నింటికంటే ఎక్కువగా 1926లో ఆస్టిన్ గులాబీ కార్ (ఏపీఎక్స్6715)ను చూడాలని తహతహలాడారు. ఆయా కార్లలో కూర్చొని డ్రైవింగ్ సైతం గావించారు. 1923లో రూపుదిద్దుకున్న రైలింజన్ ఆకారంలో కలిగిన బ్లాక్ కలర్ వింటేజ్ వద్ద సెల్ఫీల సందడి అంతాఇంతా కాదు.
ఇందులో ప్రత్యేకత ఏమిటంటే హెచ్‌పీఎస్ సొసైటీ ప్రెసిడెంట్ గుస్తీ నోరియా పాతకాలపు కారు ఆకర్షణగా నిలిచింది. 1933లో తయారైన చెవర్లెట్ కారుకు గుస్తీ నోరియా ఓనర్‌గా ఉన్నారు. ఈ కారును నిజామ్స్ ఆర్థిక సలహాదారు ఖాన్ బహదూర్ ఉపయోగించినట్లు తెలిసింది. ఇక 1964కు చెందిన ఓల్డ్స్మొబిల్-జెడ్85 కారును ప్రిన్స్ ముఖర్రం ఝా బహదూర్‌కు పట్టాభిషేకం సందర్భంగా బహుమానంగా ఇచ్చారు. 1951లో తయారైన డిడ్జ్ కార్నెట్-6 కారును 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తనకు ఎంతో ఇష్టంగా నచ్చిందని కొనుగోలు చేశారు. దీనికి ప్రత్యేకమైన అలారాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఇలా అనేక పాతకాలపు కార్లు వీక్షకులను ఎంతగానో అరించాయి.
సమస్యలు ఎదుర్కొనాలంటే ఐపీఎస్తోనే సాథ్యం. అందుకే ఐపీఎస్ సాధిస్తాను. మా తల్లిదండ్రుల ఆశయం కూడా అదే. నన్ను ఐపీఎస్ కావాలని ప్రోత్సహిస్తున్నారు. ఆటలంటే నాకు ఎంతో ఇష్టం. పట్టుదలతో చదివి తప్పకుండా పోలీస్ ఆఫీసర్‌ను కావాలనేదే నా ధ్యేయం. అందుకు అనుగుణంగా చదువుతాను. మా పాఠశాలలో గురువులు ఎంతో ఆత్మైస్థెర్యాన్ని పెంపొందిస్తారు. అందుకనుగుణంగానే చదివేందుకు ప్రయత్నిస్తాం. అనుకున్నది సాధించే వరకు ప్రోత్సహిస్తారు. నా కలను నిజం చేసుకుంటా.
– కార్నికేశ్, 7వ తరగతి
పుస్తకాలు చదవడమే కాదు. ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్‌ను మా పాఠశాలలో నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే విద్యార్థులు తమకు తాముగా తీర్చిదిద్దుకునే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తారు. అందుకనే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అన్ని కోణాల్లో ఆలోచించగలుగుతారు. అన్నింటా ముందుండేందుకు ప్రయత్నిస్తారు. నేను కలెక్టర్ కావాలని అనుకుంటున్నాను. పట్టుదలతో చదివి తప్పకుండా ఐఏఎస్ సాధిస్తాను.
– పుణీత్, 5వ తరగతి