హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): జీహెచ్ ఎంసీ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేసిన కేసును హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. చట్ట సవరణ ఆర్డినెన్స్‌పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖలను ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 28కి వాయిదా వేసింది. తుకుగూడ మున్సిపాలిటీతోపాటు మరికొన్నింటినీ జీహెచ్ఎంసీలో విలీనం చేసే క్రమంలో బల్దియా చట్టానికి సవరణ తెస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.
ఆర్డినెన్స్ 9, 10, 11ను సవాలు చేస్తూ తుకుగూడకు చెందిన జీ బరిగాల రాజు వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎల్. రవి చందర్ వాదిస్తూ, ఆర్డినెన్స్ జారీతో తుకుగూడ మున్సిపాల్టీ జీహెచ్ఎంసీలో విలీనమైందని చెప్పారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పిటిషనర్ పోటీ చేయాల నుకుంటున్నారని, మున్సిపాల్టీ జీహెచ్ఎంసీలో విలీనం వల్ల హద్దులు మారిపోయాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నోటిఫికేషన్‌కు ముందు మున్సిపల్ కార్పొరేషన్‌తో సంప్రదించలేదన్నారు.