సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తీరు కాసులు రాబట్టడంలో ఉన్న చురుకుదనం.. కనీస సౌకర్యాలు కల్పించడంలో లేదు అన్న విమర్శలకు తావిస్తోంది. నగరం నలుమూలల నుంచి పన్నుల వసూళ్లను వంద శాతం రాబట్టడమే లక్ష్యంగా యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. పరిపాలన సౌలభ్యం, సాంకేతికత పేరుతో ప్రభుత్వం కామన్ బిల్లు విధానాన్ని తెరపైకి తెచ్చింది. విద్యుత్, మంచినీటి బిల్లులతో పాటు ఆస్తి పన్నును కలిపి ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ఆదివారం (ఫిబ్రవరి 1) నుంచి గ్రేటర్ వ్యాప్తంగా ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది. అయితే, పన్నుల వేటలో చూపిస్తున్న శ్రద్ధ.. ప్రజల ప్రాణరక్షణ, మౌలిక వసతుల కల్పనలో మచ్చుకైనా కనిపించడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు.
సంయుక్త సర్వే
పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన తాజా ఆదేశాల (మెమో నెం. 371/2026) మేరకు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (రెవెన్యూ) యుద్ధ ప్రాతిపదికన కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 1 నుంచి 15వ తేదీ లోపు నగరంలోని ప్రతి ఇంటి ప్రాపర్టీ టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పీటీఐఎన్)ను విద్యుత్ కనెక్షన్ (యుఎస్సీ) మొబైల్ నంబర్లతో అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్లు, విద్యుత్ శాఖ మీటర్ రీడర్లు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. గడువులోగా ఈ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని డిప్యూటీ కమిషనర్లకు ఈ సందర్భంగా కమిషనర్ డెడ్ లైన్ విధించారు. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని బకాయిల్లేకుండా వసూలు చేయడమే దీని వెనుక ఉన్న అసలు వ్యూహమని స్పష్టమవుతోంది.
ప్రజా సమస్యలు గాలికి..
గ్రేటర్ హైదరాబాద్లో వీధి కుకల బెడదతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లలు బలైపోతున్నా, వృద్ధులు గాయపడుతున్నా నివారణ చర్యల్లో జీహెచ్ఎంసీ విఫలం చెందారన్న విమర్శలు లేకపోలేదు. దీంతో పాటు శానిటేషన్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల కోసం ఆర్భాటం చేసే అధికారులు.. గల్లీల్లో పేరుకుపోతున్న చెత్తను, అపరిశుభ్రతను గాలికి వదిలేశారని విమర్శలు ఉన్నాయి. పన్నులు రాబట్టడంలో చూపిస్తున్న వేగంలో పదో వంతు ప్రజా సమస్యల పరిషారంలో చూపిస్తే ప్రజలే స్వచ్ఛందంగా సహకరిస్తారని వాదనలు వినిపిస్తున్నాయి. అది వదిలేసి, సేవలు అందించకుండా కేవలం కామన్ బిల్లు పేరుతో భారం మోపాలని చూడటం భావ్యం కాదని మేధావులు హెచ్చరిస్తున్నాయి.