యువహీరో హవీష్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’. కావ్య థాపర్ కథానాయిక. నక్కిన త్రినాథరావు దర్శకుడు. నిఖిల కోనేరు నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సినిమా తొలి పాట లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ‘కొంచెం కొంచెం’ అంటూ సాగే ఈ రొమాంటిక్ మెలొడీని ప్రముఖ దర్శకుడు బాబీ, ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
ఈపాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, మిక్కీ జే మేయర్ స్వరపరిచారు. సమీరా భరద్వాజ్ ఆలపించారు. ఈవెంట్లో చిత్ర దర్శకుడు నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ ‘ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని విధాలుగా ఆడియన్స్‌ని ఆకట్టుకునే సినిమా ఇది. త్వరలోనే రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం’ అని తెలిపారు. ఈ సినిమా కన్నుల పండువగా ఉంటుందని నిర్మాత కోనేరు సత్యనారాయణ నమ్మకంగా చెప్పారు. దర్శకుడు నక్కిన త్రినాథరావు వినోదాత్మకంగా సినిమాను మలిచారని, సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుందని హీరో హవీష్ నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా మైత్రీ శశిధర్ కూడా మాట్లాడారు.