నగరాన్ని విశ్వనగరంగా మార్చే మెట్రో విస్తరణతో సర్కార్ ఆటలాడుతోంది. రెండో దశ విస్తరణ, రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో స్వాధీనం చేసుకున్నా అడుగు ముందుకు పడాలంటే కేంద్రం కనికరించాల్సిందేనని ఇప్పుడు సామాన్యుడికి అర్థమవుతున్నది. మొత్తం 160 కిలోమీటర్ల మేర నగరంలో మెట్రో విస్తరించాలని, దీనికి రూ. 43వేల కోట్లు ఖర్చు అవుతుందని కాంగ్రెస్ సర్కార్ అంచనా వేసింది. అయితే ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడం రాష్ట్ర ఖజానాకు తలకు మించిన భారమని తెలిసినా.. కేంద్రంపై ఆధారపడకుండానే ప్రాజెక్టును చేపడుతున్నామనే స్థాయిలో మాట్లాడింది. తీరా ప్రాజెక్టులుకు కనీసం అనుమతులతో పొందలేక నగరంలో మెట్రో విస్తరణను రేవంత్ సర్కార్ పరిహాసం చేస్తోంది.
సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): మెట్రో విస్తరణలో భాగంగా మొత్తం ప్రాజెక్టులో రాష్ట్ర సర్కారు వాటా సగానికి కంటే తక్కువే. కానీ 50-50 జాయింట్ వెంచర్‌గా చేపడుతామని చెబుతోంది. ఇందులో కేంద్రం అనుమతి లేకుండా ఒక్క ఇటుక కదిలే పరిస్థితి లేదని తెలిసిపోతున్నది. ప్రాజెక్టు వ్యయంలో 18 శాతం నిధులను కేంద్రం నేరుగా ఇవ్వాలని, మిగిలిన 48 శాతం రుణాలకు కేంద్రం సావరిన్ గ్యారంటీగా జైకా, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థలకు పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతా చేసి రాష్ట్ర సర్కార్ కంటే ఎక్కువ నిధులను కేంద్రం నుంచి తీసుకువచ్చి ప్రాజెక్టును చేపట్టడం అసాధ్యమని చెప్పాలి.
స్వాధీనం చేసుకోవడం తప్పిదమే..?
మొదటి దశ మెట్రోను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే వ్యూహాత్మక తప్పిదమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎందుకంటే నిర్మాణ సంస్థనే నేరుగా మోయలేనని చేతులు ఎత్తి వేస్తే… ఒప్పందం అంశాన్ని ప్రస్తావించకుండా, రెండో దశ మెట్రోతో మరో భారాన్ని నెత్తిన వేసుకున్నది రాష్ట్ర సర్కార్. ఇక నాగోల్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నేరుగా ప్రయాణించేలా మెట్రో డిజైన్ చేస్తామని గొప్పలు చెప్పుకున్నది. అయితే కేంద్రం సహకారం లేనిదే ప్రాజెక్టు పట్టాలెక్కదని తెలిసి కూడా పేరు కోసం మెట్రో విస్తరణ పేరిట రాజకీయ జిమ్మికులకు దిగుతున్నది.