సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు.. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ తీసుకొచ్చిన వాహన్, సారథి పోర్టల్ వాహనదారుడికి చుక్కలు చూపిస్తున్నది. సరైన సమయంలో సేవలు అందక వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తున్నది. స్లాట్ బుక్ చేసుకున్న రోజు కాకుండా ఆ సేవలు మరుసటి రోజు పొందాల్సిన దుస్థితి సారథి పోర్టల్‌లో ఉంది. ప్రతీ అరగంటకోసారి సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఏ రోజుకు ఆ రోజు సేవలు అందించాల్సిన అధికారులు.. పోర్టల్ పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బందితో వాగ్వాదం..
దేశ వ్యాప్తంగా వాహన్, సారథి పోర్టల్ నడుస్తున్నది. దీంతో సర్వర్‌పై లోడ్ భారం పడుతున్నది. అయితే ఈ మేరకు ఇక్కడి అధికారులు సాంకేతిక సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. 80 శాతం కంప్యూటర్ల ఓల్డ్ వెర్షన్‌తో కొనసాగుతున్నాయి. దీంతో సర్వర్‌పై భారం పడినప్పుడు ఈ కంప్యూటర్ల పనితీరు సరిగా ఉండటం లేదు. దీంతో సిబ్బంది మళ్లీ కంప్యూటర్లు లాగ్ అవుట్ లాగ్ఇన్ కావాల్సి వస్తున్నదని చెబుతున్నారు.
మరోవైపు వాహనదారులు సైతం తమ పనులు మానుకొని సేవల కొసం ఆర్టీఓ కార్యాలయానికి వస్తే పనికాకపోతుండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సారథి పోర్టల్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం గగనమే. ఇప్పటికే అధికారులు పోర్టల్ పనితీరుపై రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఆ సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా సారథి పోర్టల్ అమలు చేస్తే అసలుకే మోసం వస్తుందని నివేదించినట్టు తెలిసింది. కాగా, సికింద్రాబాద్ మినహా ఇతర ఆర్టీఓ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైనా వెంటనే ఆ సమస్యను ఐటీ టీం పరిష్కరించి సేవలు సకాలంలో అందేల చేస్తుండటం విశేషం.
వాహనదారుల బెంబేలు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాహన్, సారథి పోర్టల్‌ను తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టే ముందర సికింద్రాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో పైలెట్ ప్రాజెక్టుగా సారథి పోర్టల్ సేవలు ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టు కూడా పూర్తయింది. అయితే ఈ సేవలు పొందడానికి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి ముందర వెళ్లినా.. ఆలస్యంగా వెళ్లినా స్లాట్ గడువు ముగిసినట్టు చూపిస్తున్నది. అంత సమయం ఆగుదామని వాహనదారులు ఆగినా.. అరగంటకోసారి ఏర్పడే సాంకేతిక సమస్యతో స్లాట్ సమయం దాటిపోతున్నది. దీంతో వాహనదారులు మళ్లీ స్లాట్ బుక్ చేసుకుని మరుసటి రోజు రావాల్సిన దుస్థితి ఉంది.