‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్న చందంగా ‘కుర్చీ ఉండగానే కొల్లగొట్టెయ్’ అన్నట్టుగా జీహెచ్ఎంసీ పాలకవర్గం వ్యవహరిస్తున్నది. మరో నెల రోజుల్లో పదవి నుంచి దిగిపోతున్న నేపథ్యంలో అందినకాడికి దోచుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు పోటీ పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నిబంధనలు బేఖాతరు చేస్తున్నారని, సన్నిహితులు, కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా జరుగుతున్న గంపెడు అవినీతిలో తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇదేదో నిధుల దుర్వినియోగం కాదు.. ఏకంగా జీహెచ్ఎంసీ పార్కునే ధారాదత్తం చేసే కుట్ర. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను తుంగలో తొక్కి సుమారు రెండు వేల చదరపు గజాల పార్కు స్థలాన్ని ప్రైవేటుపరం చేశారు. పార్కు విస్తీర్ణం మూడెకరాలకు పైగా ఉన్నది. కాబట్టి ఈ కబ్జాకాండ ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తతంగం వెనుక బల్దియా పెద్దలతోపాటు అధికార యంత్రాంగానికి కార్పొరేట్ సంస్థ ప్రతినిధి నుంచి రూ.కోట్లల్లో ముడుపులు ముట్టాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిలో పేదలు గుడిసె వేసుకున్నా విరుచుకుపడే బుల్డోజర్లు ఈ పార్కువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. చెరువులను పునరుద్ధరించామంటూ గొప్పలు చెప్పుకొంటున్న హైడ్రా ఈ పార్కు విషయంలో మాత్రం మూగబోవడం గమనార్హం. దీనిని బట్టే ప్రభుత్వ పెద్దల జోక్యం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఎక్కడైనా ఓ నిరుపేద గజం ప్రభుత్వ జాగలోకి జరిగాడంటే చాలు హైడ్రా పరుగున వచ్చి, బుల్డోజర్లతో విరుచుకుపడుతున్నది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా, కనీసం సామాన్లు తీసుకునే సమయం ఇవ్వకుండా క్షణాల్లో ఆ ఇంటిని నేలమట్టం చేస్తున్నది. గతంలో ప్రభుత్వమే అనుమతులు ఇచ్చినా, అధికారికంగా అన్ని పత్రాలు ఉన్నా అధికారులు ఊరుకోవడం లేదు. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే చెరువులు, రూ.వేల కోట్ల విలువైన పార్కుల భూములను స్వాధీనం చేసుకుంటున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నది.
మరి.. నగరం నడిబొడ్డున ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 32లో ఏం జరిగిందో తెలుసా. చదరపు గజం సుమారు రూ.3.5 లక్షల వరకు ధర పలికే ఖరీదైన ప్రాంతం. అక్కడ విశాలమైన జీహెచ్ఎంసీ పార్కు స్థలం ఉన్నది. దానిని ఆనుకొని ఉన్న పెద్దోళ్లకు రెండు ప్లాట్లు ఉన్నాయి. వాటికి విశాలమైన రోడ్లు కూడా ఉన్నాయి. కానీ ఆ రెండు ప్లాట్లను కలిపితే బాగుంటుంది కదా అనే ఆలోచన వారికి వచ్చింది. మధ్యలో జీహెచ్ఎంసీ పార్కు స్థలం ఉన్నట్టు గుర్తించారు. తమకు చెందిన దాదాపు వంద గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీకి ఇస్తామని, ఇందుకు ప్రతిగా అంతే విస్తీర్ణంలోని పార్కు స్థలాన్ని తమకు ఇస్తే రెండు ప్లాట్లు కలిసిపోతాయని కార్పొరేట్ కంపెనీ డైరెక్టర్ దరఖాస్తు చేసుకున్నారు. అంతే.. బల్దియా పెద్దలు, అధికారులు కాళ్లకు చక్రాలు కట్టుకొని పనిచేశారు.
టౌన్‌ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారు. స్థలాలు మార్పిడి చేసుకుంటే బాగుంటుందని తేల్చేశారు. ఫైలు సిద్ధమైందే ఆలస్యం! ఏకంగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ గుట్టుచప్పుడు కాకుండా దానిని ఆమోదించింది. ఎజెండాలో పెడితే అందరికీ తెలుస్తుందని, టేబుల్ అంశంగా చివరి నిమిషంలో తీసుకువచ్చారు. వెంటనే ఆ ఫైలుకు మోక్షం కల్పించారు. ఇక్కడే అసలు మతలబు. స్టాండింగ్ కమిటీ ఆమోదించింది 98.92 చదరపు గజాల పరస్పర మార్పిడికి మాత్రమే. కానీ క్షేత్రస్థాయిలో దాదాపు రెండు వేల చదరపు గజాలను చుట్టూ రేకులు వేసి స్వాధీనం చేసుకున్నారు. 20 రెట్లు అదనంగా ఆక్రమించినా అధికారులు, పాలకులు మౌనంగా ఉన్నారు. జీహెచ్ఎంసీ పాలక వర్గ పెద్దలకు భారీగా ముట్టాయని, అందుకే అంతా కండ్లుమూసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్కు స్థలం మూడెకరాలకు పైగా ఉన్నదని, కబ్జా రెండు వేల గజాలతో ఆగదని, పెద్దల పదవీకాలం ముగిసేలోగా పాదరసంలా మరింత పాకుతూ ముందుకు వెళ్తుందా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏమిటీ ఈ మార్పిడి వ్యవహారం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ముందుకు కొన్నిరోజుల కిందట ఓ దరఖాస్తు వచ్చింది. ఓ ఫార్మా కంపెనీకి చెందిన మహిళా డైరెక్టర్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు-32లోని జూబ్లీహిల్స్ సొసైటీలో గత ఏడాది ఆగస్టు 30న పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈ దరఖాస్తు చేసుకున్నారు. షేక్‌పేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 403/1 ఓల్డ్, 120 న్యూ, అలాగే హకీంపేట సర్వే నంబరు 103/1లో ఉన్న ప్లాట్ నంబర్లు 548/ఏ24, 548/ఏ25లను గతేడాది మే నెలలో కొనుగోలు చేసినట్లు ఆమె దరఖాస్తులో పేర్కొన్నారు. ఈ ప్లాట్‌కు అనుకుని ఉన్న మరో ప్లాట్ 548/ఏ28ని తన తల్లిదండ్రులు ఆగస్టులో కొనుగోలు చేశారన్నారు. మొత్తం 2,454 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాట్ల మధ్య రాకపోకలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తినట్లు లేఖలో తెలిపారు.
తమ ఆస్తికి నైరుతి (సౌత్-వెస్ట్) మూలలో ఉన్న స్థలం కుచించుకుపోవడం వల్ల తల్లిదండ్రుల ప్లాట్‌లోకి వెళ్లడానికి ఆటంకం కలుగుతున్నదని వెల్లడించారు. దీనికి పరిష్కారంగా తమ ప్లాట్‌కు ఆగ్నేయ (సౌత్-ఈస్ట్) దిశలో ఉన్న కొంత భూమిని జీహెచ్ఎంసీ పార్కుకు ఇచ్చి, దానికి సమానమైన పార్కు స్థలాన్ని తమకు కేటాయించాలని దరఖాస్తులో ప్రభుత్వాన్ని కోరారు. ఈ మార్పిడి వల్ల అటు పార్కు సరిహద్దులు స్పష్టంగా ఉంటాయని, ఇటు తమ ప్లాట్లకు వెళ్లేందుకు కూడా సులభంగా ఉంటుందని పేర్కొన్నారు. తన వద్ద ఉన్న 98.92 చదరపు గజాల సొంత స్థలాన్ని (ప్లాట్ ఆగ్నేయ మూల) జీహెచ్ఎంసీకి అప్పగిస్తానని, దానికి బదులుగా తమ ప్లాటుకు అనుకుని ఉన్న నైరుతి దిశలోని అంతే విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కు భూమిని తనకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.
కార్పొరేట్ కంపెనీ డైరెక్టర్ దరఖాస్తు కావడంతో పురపాలక శాఖ వెంటనే స్పందించింది. జీహెచ్ఎంసీ అధికారులు 2,454 గజాల ప్లాట్లను పరిశీలించారు. దరఖాస్తుదారుకు యాజమాన్య హక్కులు ఉన్నాయని ఖైరతాబాద్ జోనల్ అధికారుల బృందం తేల్చింది. మార్పిడి చేసే ప్రాంతం ఖాళీగానే ఉన్నదని, ఎటువంటి అక్రమణలు లేవు అని, అనుకూలంగా నివేదిక ఇచ్చింది. వెంటనే ఈ అంశం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ముందుకు వెళ్లింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సంతకంతో ఈ ఫైల్ స్టాండింగ్ కమిటీ ముందుకు టేబుల్ అంశంగా చివరి నిమిషంలో రావడం, ప్రతిపాదనను చకచక ఆమోదించడం రాకెట్ వేగంతో జరిగిపోయాయి.

నిబంధనలు ఏం చెప్తున్నాయి?
సాధారణంగా మున్సిపల్ చట్టాల ప్రకారం లే అవుట్లో పార్కు కోసం కేటాయించిన ఓపెన్ స్పేస్‌ను ప్రజా ప్రయోజనాల కోసమే వాడాలి. అంతే తప్ప ప్రైవేట్ వ్యక్తుల యాక్సెస్ కోసం లేదా వారి సౌకర్యం కోసం మార్పిడి చేయడానికి వీల్లేదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం స్పష్టంగా ఉన్నాయని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. పరస్పర భూ మార్పిడి ముసుగులో రూ.కోట్ల విలువైన జూబ్లీహిల్స్ పార్కు స్థలం ఇలా ప్రైవేట్ వ్యక్తుల పరం కావడానికి అధికార యంత్రాంగం సహకరించడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ మ్యూచువల్ ఎక్సేంజ్ ఒప్పందానికి స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే భవిష్యత్తులో గ్రేటర్ హైదరాబాద్‌లోని పార్కులన్నీ ఇలాంటి ‘మార్పిడి’ల పేరుతో కనుమరుగు కావడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఈ విషయంలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ప్రచారం సాగుతున్నది.
పార్కులోకి వెళ్లేదారినే మూసేశారు
స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందిన విషయం తెలిసిన వెంటనే రాత్రికి రాత్రే సదరు యాజమాని పార్కు స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. అధికారిక ఉత్తర్వులు వెలువడకముందే పార్కుకు సంబంధించిన స్థలాన్ని చదును చేశారు. ఎవరూ ఆ స్థలంలోకి వెళ్లకుండా భారీ రేకులను ఏర్పాటు చేశారు. దీంతో సాధారణ ప్రజలు అటువైపు నుంచి పార్కులోకి వెళ్లేందుకు ఉన్న దారి మూసుకుపోయింది. పైగా స్టాండింగ్ కమిటీ కేవలం 98.92 చదరపు గజాల స్థలం మార్పిడికి ఆమోదం తెలిపితే.. క్షేత్రస్థాయిలో ఏకంగా రెండు వేల గజాల వరకు కబ్జా చేసుకున్నట్టు స్థానికులు చెప్తున్నారు. అంటే అనుమతించినదానికన్నా ఇరవై రెట్లు అధికం. కండ్ల ముందు కబ్జా కాండ కనిపిస్తున్నా, జీహెచ్ఎంసీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. బల్దియా పెద్దలతోపాటు అధికారులకూ భారీ ఎత్తున ముడుపులు ముట్టాయనేందుకు ఇదే బలాన్ని చేకూరుస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.
కుర్చీ దిగిపోయేలోపు దండుకోవాలని..
ఈ కబ్జా కాండ వెనుక బల్దియా పెద్దలతోపాటు అధికార యంత్రాంగానికి రూ.కోట్లల్లో ముడుపులు ముట్టాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బల్దియా పాలకవర్గం పదవీకాలం మరో నెల రోజుల్లో ముగియనున్నది. దీంతో తాము పదవి నుంచి దిగిపోయేలోపు అందినకాడికి దండుకోవాలని కొందరు పెద్దలు నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో విచ్చలవిడిగా తెగబడిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విలీన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పాత బిల్లుల చెల్లింపులు, పాత పనులకు కొత్త ముసుగేసి పనులు చేయకుండానే రూ.కోట్ల బిల్లులు దండుకొని ప్రజాధనాన్ని లూఠీ చేశారన్న విమర్శలు ఉన్నాయి.
మాజీ ఛైర్మన్లు, కార్పొరేటర్లు ఇదే తమకు చివరి అవకాశం అనే సాకుతో తెగబడితే… అవినీతి అవకాశాన్ని అందిపుచ్చుకొని కమిషనర్లు తలుపులు బార్లా తెరిచారన అంటున్నారు. పనుల పేరిట స్థానిక సంస్థల ఖజానాను కొల్లగొట్టడంతో పాటు ఎన్వోసీలు, అనుమతుల పేరిట అధికారులు అదనపు అవినీతి సొమ్మును వెనకేసుకున్నారని అంటున్నారు. వీటిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ అంటూ హడావిడి చేసినా ఇప్పుడు ఆ విచారణ ఎక్కడ ఉందో అని విచారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే తరహాలో జూబ్లీహిల్స్‌లో నిబంధనలకు, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ‘విజయ’వంతంగా వంద గజాల స్థలం మార్పిడి చేశారని అంటున్నారు. దానిని అడ్డుపెట్టుకొని రెండువేల చదరపు గజాల భూమి కబ్జా వెనుక కూడా పెద్దల అండ ఉన్నట్టు తెలుస్తున్నది.