సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): వార్డు నం14లోని జ్ఞాన్‌బాగ్ కాలనీలో ఉన్న జీహెచ్ఎంసీ ఆట స్థలం 2-3 రూములతో కూడిన కమ్యూనిటీ హాల్‌తో విశాలమైన మైదానంతో ఉండేది. ఇక్కడ స్తానికంగా ఉండే గోడెకి కబర్, పాన్ మండి గోషామహల్ ప్రాంతంలోని వివిధ బస్తీలు, కాలనీవాసుల పిల్లలు ఆడుకోవడం, చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడం చేసేవాళ్లు. అయితే ఆ గ్రౌండ్లో ఉన్న కమ్యూనిటీ గదులు పురాతనమవ్వడంతో తమ సొంత ఖర్చులతో వాటిని పునర్ నిర్మించుకోవడానికి స్థానిక కాలనీ వాసులు పూనుకున్నారు.
అందులో భాగంగా కొత్తది కడుతున్నామంటూ కలరింగ్ ఇస్తూ, సగానికి సగం ఆటస్థలాన్ని ఆక్రమించేలా ఒక భారీ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ కాంప్లెక్స్ తరహా భవనానికి పక్కా కమర్షియల్ స్కెచ్ వేశారు. ఎవరూ అడ్డుకోకముందే పని పూర్తిచేయాలనే అత్రుతతో ఆఘమేఘాలపై గట్టి పునాదులు తవ్వి, బలమైన పిల్లర్లతో రెండు ఫ్లోర్ల స్లాబ్‌లను కూడా వేసేశారు. ఈ అక్రమ కట్టడాలపై స్తానికులు తిరగబడటంతో మొదట్లో జీహెచ్ఎంసీ స్థానిక ప్రజలకు అండగా నిలిచింది. ఇవన్నీ అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేవు, కూల్చేస్తాం అంటూ హెచ్చరిస్తూ 2024లోనే నోటీసులు జారీ చేసింది. దీనిపై సదరు అసోసియేషన్ కోర్టుకు వెళ్లింది. ఆ సమయంలో జీహెచ్ఎంసీ స్వయంగా కోర్టుకు సమర్పించిన నివేదికలో ఇది ఆట స్థలం.. ఇక్కడ ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేవు, ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ కోర్టుకు తెలిపింది. సదరు అసోసియేషన్ స్టేటస్ కోఆర్డర్ తెచ్చుకోవడం.. ఆ తర్వాత పిటిషన్ విత్‌డ్రా కావడం జరిగాయి.
మాట మార్చిన జీహెచ్ఎంసీ..!
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే సంబంధిత స్థలంపై అక్రమాలు పురుడు పోసుకున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్, జీహెచ్ఎంసీ అధికారులు ఆ స్థలం ఆట స్థలమని చెప్పినా.. స్థానిక నాయకులు పాత కమ్యూనిటీ హాల్‌ను బాగు చేయిస్తున్నామనే ముసుగును తొడిగారు. అప్పటికే అక్కడ బలమైన పునాదులతో రెండంతస్తుల భవనం నిర్మాణమయ్యింది. అక్రమంగా నిర్మించిన ఆ భవనాలను సక్రమం చేస్తూ జీహచ్ఎంసీ కమ్యూనిటీ నిర్మాణం కోసం రూ.43.5 లక్షలు మంజూరు చేసింది. నిన్నటి వరకు కూల్చేస్తామన్న భవనానికి ఈరోజు ప్రభుత్వ నిధులు కేటాయించడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్తానిక నాయకుడు ఒకరు 2026లో మరోసారి కోర్టుకు వెళ్లి జీహెచ్ఎంసీ రూ.43.5 లక్షలు విడుదల చేయడాన్ని ప్రశ్నించాడు. అయితే ఈ సారి జీహెచ్ఎంసీ అధికారులు కోర్టుకు భిన్నమైన వాదన వినిపించారు, విస్త్రతమైన ప్రజాప్రయోజానాలను దృష్టిలో ఉంచుకొని మిగిలిపోయిన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.43.50 లక్షలు మంజూరు చేశామంటూ కోర్టుకు తెలిపింది.

బోర్డును పీకేసినా పత్తాలేరు..!
మొదట్లో జీహెచ్ఎంసీ కోర్టుకు చెప్పింది నిజమనే భావనలో స్థానికులు మురిసిపోయారు. అక్కడ నిర్మితమైన భవనం ప్రజలకు కమ్యూనిటీ హాల్‌గా ఉపయోగపడుతుందని భావించారు. సంబంధిత నూతన భవనంపై జీహెచ్ఎంసీ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. సదరు కాలనీ, బస్తీవాసుల డిమాండ్‌తో మొదట్లో జీహెచ్ఎంసీ బోర్డును అధికారులు ఏర్పాటు చేయగా.. తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఆ బోర్డును తొలగించారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనా ఆ భవనం అలాగే ఉండిపోయింది.
ప్రైవేట్ పరం చేసే దిశగా…!
ఆట స్థలం అంతా ఖరీదైన కాలనీలో ఉండటం, ఆ కాలనీలో ఉండే వాళ్లంతా బడాబాబులే కావడంతో ఏకంగా ఆ కాలనీకి నలువైపులా ఉన్న రోడ్లను సైతం గతంలో మూసేశారు. స్థానిక ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో అవి తెరుచుకున్నాయి. ఇరువైపుల ఉండే బస్తీవాసులను అక్కడకు రానివ్వకుండా ఉండేలా, భారీ భవంతిని నిర్మించేందుకు అక్కడ స్కెచ్ వేశారనే ఆరోపణలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ బోర్డు ఏర్పాటు చేస్తే అంది అందరిది అవుతుంది, దాంతోనే అక్కడ బోర్డు లేకుండా సదరు అసోసియేషన్ ప్రయత్నాలు సాగిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భవనంలో వ్యాపార సముదాయాన్ని నిర్మించి సదరు అసోసియేషన్ స్వాధీనంలో ఉంచుకోవాలనే కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఒక జాతీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దీని వెనుకుండి చక్రం తిప్పుతున్నాడని, ఆ భవనంలో తన పార్టీ అనుబంధ సంస్థకు కార్యాలయాన్ని కూడా తీసుకోవడానికి ఒప్పందాలు జరిగిపోయాం టూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందుకు జీహెచ్ఎంసీ కూడా పూర్తి మద్దతు తెలుపుతుందనే విమర్శలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ తమ స్వాధీనంలోకి తీసుకొని ప్రజలందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దాల్సిన భవనం విషయంలో రెండు నాల్కల ధోరణితో వ్యవహరించడం, ఆ తరువాత ఆ పక్కకు చూడకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
