సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): యువత నూతన ఆలోచనల విధానం, నైపుణ్యం వల్ల దేశం అభివృద్ధి దిశలో పయనిస్తుందని, దేశాల మధ్య ఆలోచనల పరస్పర బదిలీ జరగాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేరొన్నారు. హైదరాబాద్ వేదికగా జీ 20 స్టార్టప్ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌తో ప్రపంచం అనేక సవాళ్లను ఎదురొందన్నారు. ఈ సమయంలో దేశంలో అనేక స్టార్టప్,ఇంక్యుబేటర్లు వచ్చాయని చెప్పారు. హైదరాబాద్ విభిన్న సంసృతుల రాజధానిగా విలసిల్లుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
అనంతరం వర్చువల్ విధానంలో కేంద్ర వాణిజ్య-పరిశ్రమలు, జౌళీ శాఖల మంత్రి పీయూశ్ గోయల్ కీలకోపన్యాసం చేశారు. ఆవిష్కరణలే మన దేశానికి మంచి పునాదిగా నిలుస్తాయన్నారు. అత్యాధునిక టెక్నాలజీలతో మెట్రో నగరాల్లోని స్టార్టప్‌లే కాకుండా కింది పట్టణాల్లోనూ స్టార్టప్‌లు వస్తే స్థానిక సమస్యలకు పరిష్కారం చూపే అవకాశం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్, జీ 20 భారతదేశ ప్రతినిధి, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్, నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) పరమేశ్వరన్ అయ్యర్,జీ20 స్టార్టప్ బృందం చైర్మన్ డాక్టర్ చింతన్ వైష్ణవ్, పాల్గొన్నారు.