జియాగూడ, డిసెంబర్ 27 : పాత నగరంలోని జియాగూడలోని చరిత్రాత్మకమైన శ్రీరంగనాథస్వామి దేవస్థానంలో జనవరి 2వ తేదీన జరిగే వైకుంఠ(ముక్కోటి)ఏకాదశి మహోత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం జియాగూడలోని రంగనాథస్వామి దేవస్థానానికి హాజరైన మంత్రికి ఆలయ చైర్మన్ తిరువెంగళాచార్యులు, ప్రధాన అర్చకులు శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
మంత్రి వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత జియాగూడలోని శ్రీ రంగనాథస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయని చెప్పారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వైకుంఠ ద్వారా దర్శనానికి వస్తారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
అనంతరం దేవస్థానంలో వైకుంఠ మహోత్సవాల బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జియాగూడ డివిజన్ కార్పొరేటర్ బోయిని దర్శన్, బీఆర్ఎస్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మిత్రకృష్ణ, అడ్హాక్ కమిటీ సభ్యులు శేఖర్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ శాఖ చైర్మన్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, దేవాదయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలజీ, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, జలమండలి డైరెక్టర్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.