బంజారాహిల్స్,మే 10: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన యువకుడి అవయవాలను కుటుంబ సభ్యు లు దానం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అంబర్‌పేట్‌కు చెందిన చీరాల సంకీర్త్(21) గత నెల 25న నాగోల్ వద్ద బైక్‌మీద వెళ్తుండగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్చగా న్యూరో సమస్యపై సర్జరీ చేశారు. అయితే చికిత్సకు సంకీర్త్ శరీరం సహకరించకపోవడంతో ఈనెల 9న వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు.
తీవ్ర దు:ఖంలో ఉన్న సంకీర్త్ తల్లిదండ్రులు చీరాల రవిప్రకాష్, శ్రీదేవిలు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తమ కొడుకు అవయవాలు ఉపయోగపడాలనే గొప్ప ఆలోచనతో ఆస్పత్రి వర్గాలకు చెప్పారు. దీంతో జీవన్‌దాన్ సంస్థకు సమాచారం అందజేయగా సంకీర్త్ శరీరంలోని అవయవాలను సేకరించారు. కొడుకు అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చిన తల్లిదండ్రులను ఆ సంస్థ ప్రతినిధులు అభినందించారు.