చిక్కడపల్లి, ఫిబ్రవరి 10: ప్రధాన మార్గాల్లో పారిశుధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డస్డ్ బిన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రధాన మార్గాలలో పాదచారులు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా, సులువుగా చెత్త తొలగించడానికి వీలుగా డస్టుబిన్లు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించే దిశగా ప్రత్యేక రంగు గల డబ్బాలను రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశాల మేరు సర్కిల్-15 పారిశుధ్య విభాగం అధికారులు ప్రధాన రోడ్లు, రద్దీ ప్రాంతా ల్లో రోడ్లకు ఇరువైపులా సులువుగా లిఫ్టింగ్ చేసే డస్ట్బిన్లను ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు ప్రధా మార్గాలలో 40 డస్ట్బిన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి యాభై, వంద మీటర్లకు రెండు డస్ట్బిన్లు ఉండేలా చూస్తున్నారు. అందులో తడి, పొడి చెత్త వేరువేరుగా తరలించేందుకు వీలుగా రెండు వేరువేరు రంగుల డస్ట్బిన్లను వీఎస్టీ-రాంనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్-ముషీరాబాద్, కవాడిగూడ, ఇందిరాపార్కు వంటి ప్రధాన రోడ్లలో ఏర్పాటు చేశారు.
నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చెత్త డంపింగ్ సెంటర్లను ఎత్తివేసి ఇంటింటికీ చెత్త సేకరిస్తున్న అధికారులు తాజాగా ప్రధాన రోడ్లపై పారిశుధ్య సమస్య తలెత్తకుండా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన రోడ్ల వెంట ఏర్పాటు చేసిన డస్ట్బిన్లతో తడి, పొడి చెత్త వేరువేరుగా వేసేలా ప్రతి 50 మీటర్లకు ఒకటి ఏర్పాటు చేశారు. పారిశుధ్య సిబ్బందితోపాటు, పాదచారులు రోడ్లపై ఇష్టం వచ్చినట్లు చెత్త పడవేయకుండా డస్ట్బిన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని రోజు వారీగా ప్రైవేటు ఎజెన్సీ తరలించనుండగా అధికారులు పర్యవేక్షిస్తారు.
రోజువారీగా చెత్త తరలించేలా చర్యలు తీసుకుంటున్నాం. పాదచారులు, ప్రజలు రోడ్లపై చెత్త పడవేకుండా డస్టుబిన్లను అందుబాటులోకి తీసుకువచ్చాం. తడి, పొడి చెత్తను వేరుగా తరలిస్తున్నాం.
-మైత్రేయి ఏఎంహెచ్ఓ సర్కిల్-15