ఘట్కేసర్,డిసెంబర్1 : ఘట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్‌లో నిర్మిస్తున్న ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాల భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం లోపు ఈ భవనాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. కొండాపూర్‌లో ఉన్న ప్రభుత్వ భూమి సుమారు మూడెకరాల్లో ఈ భవనాన్ని హెచ్ఏఎల్ కంపెనీ ఆర్థిక సహాయంతో నిర్మిస్తున్నారు. రూ.5.5 కోట్లతో చేపట్టిన జీ ప్లస్ 1 కళాశాల భవన నిర్మాణ పనులకు 2021, డిసెంబర్లో మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. 2022, జనవరిలో పూర్తి స్థాయి నిర్మాణ పనులు మొదలయ్యాయి.
ఇప్పటి వరకు 75 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరం వరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం వస్తున్న నూతన విద్యా విధానాలకు అనుగుణంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. 11వేల,764 చదరపు ఫీట్ల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రిన్సిపాల్ చాంబర్, స్టాప్ గదులతో పాటు, వర్క్‌షాప్, తదితర వాటిని ఏర్పాటు చేస్తున్నారు. భవనం పై అంతస్తులో వంద మంది విద్యార్థినులకు సరిపడా హాస్టల్ భవనాన్ని ఏర్పాటు చేయనున్నారు. భవన నిర్మాణ పనులను రాష్ట్ర విద్యా శాఖ తరఫున ఏఈ జవహర్ పర్యవేక్షిస్తున్నారు.వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి సహకారంతో మున్సిపాలిటీలో ఆశించిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బాలికల ఐటీఐ కళాశాల ఏర్పాటుతో మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందనున్నది. అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం.
-ఎం.పావనీ జంగయ్య యాదవ్, ఘట్కేసర్ చైర్పర్సన్