గోల్నాక, జూన్ 15: మహా నగరంలో ట్రాఫిక్ తగ్గించే చర్యల్లో భాగంగా అంబర్‌పేట ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టారు. 8 ఏండ్లుగా ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు సాగడంతో అంబర్ పేట ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎట్ట కేలకు ఇటీవలే ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చినా… పక్కా ప్రణాళిక కుండా ఏర్పాటు చేసిన ఫ్లై ఓవర్ నిర్మాణంతో స్థానిక ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
కనీసం సర్వీసు రోడ్లు వేయకుండానే ఫ్లై ఓవర్‌ను కేంద్ర, రాష్ట్ర మంత్రులు అధికారికంగా ప్రారంభించి చేతులు దులుపేసుకున్నారు. ప్రధానంగా అంబర్ పేట చే నంబరు చౌరస్తా నుంచి గోల్నాక వెళ్లే సర్వీసు రోడ్డు అందుబాటులోకి రాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు.
హామీ ఇచ్చి…
అంబర్ పేట ఫ్లై ఓవర్ నిర్మాణానికి మొత్తం రూ.415 కోట్ల ఖర్చు కాగా, అందులో భూ నిర్వాసితుల కోసం జీహెచ్ఎంసీ నిధులు రూ.192 కోట్ల వాటాగా ఉంటే.. దాదాపు రూ.323 కోట్ల నిధులు నేషనల్ హైవే అథారిటీ వెచ్చించింది. 8 ఏండ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న అంబర్ పేట వాసులకు ఇటీవల ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే అంబర్ పేట చే నంబరు చౌరస్తా నుంచి గోల్నాక చౌరస్తా వరకు ప్రతి నిత్యం వేలాదిగా వాహన దారులు ప్రయాణిస్తుంటారు.
ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా ఈ సర్వీసు రోడ్డు కొన్నేండ్లుగా మూసి వేశారు. దీంతో చే నంబరు చౌరస్తా నుంచి జిందా తిలస్మాత్ మీదుగా గోల్నాక చౌరస్తా వరకు దాదాపు కిలో మీటరు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో స్థానికులతో పాటు సర్వీసు రోడ్డు వైపు మీదుగా ఉన్న షాపుల్లో వ్యాపారాలు లేక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు.
పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. గత మే నెల 5న అంబర్ పేట ఫ్లై ఓవర్‌ను అధికారికంగా ప్రారంభించారు. అంబర్ పేట మున్సిపల్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్లొన్నారు.