మేడ్చల్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): అర్బన్ పార్క్‌ల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని అటవీ శాఖ భూములలో ప్రజలకు సౌకర్యంగా ఉండి అందుబాటులో ఉన్న ప్రాంతాలలో ఆరు అర్బన్ పార్క్‌ల ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించి నిధులను మంజూరు చేసింది. అయితే, అటవీ శాఖ భూములలో ఇప్పటి వరకు ప్రతిపాదించిన అర్బన్ పార్క్‌ల ఏర్పాటుకు పనులు ప్రారంభానికి నోచుకోలేదు.
హైదారాబాద్ మహా నగరంలో ప్రజలు సేద తీరేలా ఆహ్లాదమైన వాతావారం పర్యావరణ పరిరక్షణకు అర్బన్ పార్క్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అర్బన్ పార్క్‌ల ఏర్పాటుకు రూ.6 కోట్ల నిధులు మంజూరైన పనులు ప్రారంభించక పోవడంతో అర్బన్ పార్క్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పర్యావరణ పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 8,072,46 హైక్టార్ల విస్తీర్ణం ఉండగా, 40 ఫారెస్ట్ బ్లాక్‌లు ఉన్నాయి. అటవీ శాఖకు చెందిన భూమిలో పచ్చదనాన్ని పెంపొందించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం అర్బన్ పార్క్‌లను ఏర్పాటు చేసి వాటిని తీర్చిదిద్దింది.
జిల్లాలోని అటవీ శాఖ భూములలో భాగ్యనగరం నందనవనం (నారపల్లి) 461 ఎకరాలు, జటాయువు పార్క్(మేడిపల్లి) 134 ఎకరాలు, శాంతివనం(మేడిపల్లి)134 ఎకరాలు, ప్రశాంతివనం(దూలపల్లి) 741 ఎకరాలు, అక్సిజోన్ పార్క్(దూలపల్లి) 123 ఎకరాలు, ఆయూష్ వనం(బాహూదూర్పల్లి) 49.42 ఎకరాలు, అక్సిజన్ పార్క్(కండ్లకోయ) 70.39 ఎకరాలు, ఆరోగ్యవనం పార్క్(నాగారం) 44.48 ఎకరాలు, దర్మారం(ఉప్పర్‌పల్లి) 664.85 ఎకరాలు, ప్రాణ వాయువు పార్క్ (గాజుల రామారం) 148,26 ఎకరాలు, కీసర పార్క్(కీసర) 49,42 ఎకరాలు తుర్కపల్లి పార్క్(తుర్కపల్లి) 133 ఎకరాలు, కొండగొర్రె పార్క్(లాల్‌గడి మలక్‌పేట్) 26 ఎకరాలు, వెదురువనం(తూకుంట) 94 ఎకరాలు, ఎల్లంపేట్(ఎల్లంపేట్) 12 ఎకరాలు, యాద్గార్పల్లి పార్క్(యాద్గార్పల్లి)547.30 ఎకరాలు, గౌడవెల్లి పార్క్ (గౌడవెల్లి) 16 ఎకరాలలో అర్బన్ పార్క్‌లు అభివృద్ధి జరిగాయి.