చిక్కడపల్లి,ఫిబ్రవరి 22 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బహుళ రాష్ట్ర సహకార సంఘాల బిల్లు -2022 ప్రాథమిక సహకార సంఘాల నమూనా నియమ నిబంధనలు వ్యవసాయ రంగాన్ని, సహకార సంఘాలను కార్పొరేట్ శక్తులను అప్పజేప్పే విధంగా ఉన్నాయని పలువురు వక్తలు అరోపించారు. వెంటనే ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘాల నమూనా నియమ నిబంధనలపై రౌండ్ టేబుల్ సమావేశంను నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డిలు మాట్లాడుతూ సహకార సంఘాలు అనేవి రాష్ట్ర జాబితాలోని అంశం అని వివరించారు. మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో సహకార సంఘాలను తన చేతిలోకి లాక్కొవాలని మోదీ ప్రభుత్వం కుట్రలుచేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలను కేంద్రం తన గుప్పిట్లోకి లాక్కునే ప్రయత్నం చేయడం ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం అని పేర్కొన్నారు. ఇలాంటి కుట్రలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షుడు బొతల చంద్రారెడ్డి, ప్రొఫెసర్ అరిబండి ప్రసాద్ రావు, సహకార విద్యాపీఠం నాయకులకు భూమన్న, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శంకర్, ఆర్.వెంకట్ రాములు, డి.సర్దార్, మట్టయ్య, ధర్మానాయక్, మల్లేశ్ పాల్గొన్నారు.