సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): అసలు పేరుతో నకిలీ వస్తువులు విక్రయిస్తున్న దుకాణాలపై సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి భారీ ఎత్తున వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ సుదీంద్ర కథనం ప్రకారం… రమేశ్‌కుమార్ పరివార్( బేగంబజార్‌లో ఆర్ఎం జనరల్ స్టోర్స్), గోషామహల్‌కు చందిన హితీష్ పవర్ ఫీల్ఖానాలో హితీష్ పవర్(శ్రీ సరోజ్ ఏజెన్సీ నిర్వాహకుడు), రాజస్థాన్‌కు చెందిన రమేశ్‌కుమార్ శ్రీ ట్రేడర్స్ పేరుతో ఎర్రగడ్డలో దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ ముగ్గురు రాజస్థాన్‌కు చెందిన వాళ్లు కావడంతో.. బేగంబజార్ ప్రాంతంలో జనరల్ ట్రేడింగ్ దుకాణాన్ని నిర్వహించేవారు. అందులో అనుకున్న లాభాలు రాకపోవడంతో అక్రమ దందా చేయాలని నిర్ణయించుకున్నారు. వివిధ కంపెనీల పేరుతో నకిలీ వస్తువులు తయారు చేసి విక్రయించే కాంట్రాక్టులను సంప్రదించారు.
గుడ్‌నైట్ లిక్విడ్, కాయిల్స్, గోల్డ్ ఫాష్ కాంబి ప్యాక్, లైజాల్ సర్ఫేస్, క్లీనర్ లిక్విడ్, ఫెవి కిక్ వంటి కంపెనీలకు సంబంధించిన నకిలీ వస్తువులను విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ మూడు దుకాణాలపై దాడులు నిర్వహించి రూ. 2 లక్షల విలువైన నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులను అరెస్ట్ చేసి, వారి వద్ద స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి విచారణ నిమిత్తం బేగంబజార్ పోలీసులకు అప్పగించారు.