సికింద్రాబాద్, మే 5 : సికింద్రాబాద్ కంటోన్మెంట్ వికాస్ మంచ్, ఔరంగాబాద్ కంటోన్మెంట్ జన అధికార్ మంచ్ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం పుణెలోని వైఎంసీఏలో కంటోన్మెంట్లలో నెలకొన్న సమస్యలపై చర్చలు జరిపేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సదరన్ కమాండ్ పరిధిలోని తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని వివిధ కంటోన్మెంట్లలో విలీనం అంశాన్ని బలంగా వినిపిస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో సమస్యల పరిష్కారానికిగాను దేశంలోని అన్ని కంటోన్మెంట్లను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసే విషయమై ఉద్యమించాలన్న ప్రధాన ప్రతిపాదనను ఆమోదించినట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్షుడు గడ్డం ఎబెల్, ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ తెలిపారు. కంటోన్మెంట్ జన అధికార్ మంచ్ కన్వీనర్ సునీల్ మస్కే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయా సంస్థల ప్రతినిధులు డాక్టర్ రమేశ్, సబిత, హెచ్.జాధివ్, సాగర్ తల్వార్, సరోజప్రసాద్, శ్వేతబోగె, భీమారావు, గోష్లేకర్, మోహన్ రావు, వకోడె, సోహిల్ గొవాలి, తదితరులు పాల్గొన్నారు.