సిటీబ్యూరో/బడంగ్‌పేట, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): చెరువు హద్దులను చెరిపారు… సర్వేనంబర్లనే మార్చారు… కాగితాలపై గీతలు గీశారు… ఇక ఇదే చెరువు అన్నారు. ఏండ్ల తరబడి కసరత్తు చేసి రూపొందించిన మాస్టర్‌ప్లాన్-2031 సైతం ఖాతరు చేయకుండా తాము గీసిన గీతల్లోనే చెరువు ఒదిగిపోయిందని నిర్ధారిస్తూ అధికారిక ముద్రలు వేసి సంతకాలు చేశారు. విల్లాల నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. ఇదే అదునుగా నిర్మాణ కంపెనీ భారీ ఎత్తున విల్లాల నిర్మాణాన్ని కొనసాగిస్తున్నది. దీంతో ఏడాదికి పైగా రైతులు పలువురు ‘అది చెరువు మహాప్రభో… స్పందించండి’ అని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. కానీ తాము ఏమార్చిన గీతలకు కట్టుబడి ఉన్న అధికారులు వీసమెత్తు స్పందించలేదు.
ప్రైవేటు కంపెనీ… అధికారులు కుమ్మక్కయ్యారు. రికార్డులనే తారమారు చేశారు. ఫిర్యాదు చేసిన రైతుల్ని సైతం మీ దిక్కున్న చోట చెప్పుకోండి! మేం గీసిన గీతలకు తిరుగులేదని బెదిరించారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్‌ప్లాన్-2031 సైతం తాము గీసిన గీతల కింద దిగదుడుపే అన్నారు. కానీ ప్రకృతిని మాత్రం ఏమార్చలేకపోయారు. నీరు పల్లమెరుగు అన్నట్లు చెరువు జాడ తెలిసిన వరద ఉవ్వెత్తున వచ్చి పడుతుంటే వేల కోట్ల కంపెనీ ఏమీ చేయలేకపోయింది. రంగు రంగుల పెన్నులతో సంతకాలు చేసిన ఉన్నతాధికారులు సైతం అడ్డుకట్ట వేయలేకపోయారు. బండారం బయటపడుతుందనే భయంతో ట్రక్కుల కొద్దీ మట్టి తెచ్చి అడ్డుకట్ట వేసినా దానిని సైతం చేధించుకొని వరద విల్లాల మీదుగా దిగువకు పరుగులు పెట్టింది. ఇది చెరువు అని ఇప్పటికీ నిర్మాణాల చుట్టూ వరద నీళ్లు అధికారుల నిర్వాకాన్ని చాటి చెబుతూనే ఉన్నాయి.
ఇదీ… మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామ పరిధిలోని వెంగలయ్య చెరువు దీనగాథ!..గత 20 నెలలుగా పాలకులు మొదలు ఉన్నతాధికారుల వరకు ప్రజల ముందు చెరువు అలుగు పోసినట్లు చేస్తున్న ప్రకటనలు చేతల్లో మాత్రం తూము కూడా దాటడం లేదని చెప్పే అసలుసిసలైన కథ. వెంగలయ్య చెరువుకు సంబంధించి ఓ ప్రైవేటు కంపెనీ విల్లాల నిర్మాణం కోసం చెరువు పరిధిలోని సర్వేనంబర్లను ఏమార్చిన అధికారులు..నిర్మాణ కంపెనీకి అనుకూలంగా ఒక సర్వే నంబరులో చూపాల్సిన చెరువును కొంత పక్క సర్వేనంబరులోకి తోసిపడేశారు. దశాబ్ధాలుగా రికార్డుల్లోలేని చెరువు ఒక్కసారిగా తన భూమిలో ప్రత్యక్షమవడంతో ఏడాది కాలంగా సదరు రైతు అధికారుల కాళ్లావేళ్లా పడుతున్నా పట్టించుకునే దిక్కులేదు. ప్రకృతి కరుణించడంతో కనీసం వరద నీటిని చూపి బండారం బయటపెట్టాలని 20 రోజుల కిందట హైడ్రా అధికారులనూ ఆశ్రయించాడు. కానీ ‘ఇన్నాళ్లూ ఏం చేశావ్’ అంటూ సదరు రైతు మీదనే కన్నెర్ర చేశారేగానీ చెరువు వంక కన్నెత్తి చూడటం లేదు.
మహేశ్వరం మండలం మంఖాల్ రెవెన్యూ పరిధిలోని వెంగలాయ చెరువు 618, 619, 621, 622, 623, 624 సర్వేనెంబర్లలో విస్తరించి (ఎఫ్టీఎల్, బఫర్‌జోన్) ఉన్నట్లుగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఆమోదించిన మాస్టర్‌ప్లాన్-2031లో పొందుపరిచి ఉంది. గ్రామ నక్షాలో సైతం ఈ ఆరు సర్వేనెంబర్లలో చెరువు విస్తరించి ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. చెరువు విస్తీర్ణం 32 ఎకరాల వరకు ఉందని కొందరు గ్రామస్తులు చెబుతున్నారు. కానీ నీటిపారుదల శాఖ ప్రస్తుత రికార్డుల్లో చెరువు విస్తీర్ణం కేవలం 16.44 ఎకరాలుగా మాత్రమే ఉంది. విస్తీర్ణం ఎంత అనే దానిపై అస్పష్టత నెలకొని ఉన్నప్పటికీ మాస్టర్‌ప్లాన్-2031, గ్రామ నక్షా ప్రకారం మాత్రం ఆరు సర్వేనెంబర్ల పరిధిలోకి ఈ చెరువు వస్తుందనేది మాత్రం నిర్వివాదాంశం. మరోవైపు చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌లో ఉన్న భూములు పట్టా అయినప్పటికీ నిబంధనల ప్రకారం అందులో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దు. కానీ ఇక్కడ భూముల డిమాండు గణనీయంగా పెరగడంతో నిర్మాణ కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. సర్వేనెంబరు 621, 622,623,624/1ల్లోని 37 ఎకరాల్లో ఆలయ్ ఇన్ఫ్రా విల్లాల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ మేరకు హెచ్ఎండీఏ, రెరా అనుమతులు కూడా తీసుకుంది. కాకపోతే చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో అనుమతులు ఎలా వచ్చాయనే దాని వెనకనే అసలు డ్రామా నడిచింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాస్టర్‌ప్లాన్-2031లో ఒక నీటి వనరు హద్దులు మార్చాలన్నా… మాస్టర్‌ప్లాన్‌లో ఆమోదించిన భూ వినియోగాన్ని మార్చాలన్నా (సీఎల్‌యూ) రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వే చేసి, ప్రతిపాదనలు రూపొందించిన తర్వాత హెచ్ఎండీఏ అభ్యంతరాల స్వీకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేయాలి. ఆతర్వాత హేతుబద్దమైన అభ్యంతరాలు రానట్లయితే అధికారులు సమర్పించిన ప్రతిపాదనల్ని పరిశీలించిన హెచ్ఎండీఏ కమిషనర్ నీటి వనరు పరిధిలోని సర్వేనెంబర్లను డీనోటీఫై చేసేందుకు, ఒకవేళ భూ వినియోగ మార్పిడి ఉంటే ఆ మేరకు పరిశీలన చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి. ప్రభుత్వం వాటిని పరిశీలించి ఆమోదించి ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆతర్వాతనే నీటి వనరు హద్దులు మారి సర్వేనెంబర్ల డీనోటిఫై జరగడం భూ వినియోగ మార్పిడి ఉంటే ఆ మేరకు మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయడం జరుగుతుంది. కానీ వెంగళయ్య చెరువుకు సంబంధించి ఇవేవీ జరగలేదు.
మహేశ్వరం తాసిల్దార్, నీటిపారుదల శాఖ డీఈఈ, ఏఈఈ సంతకాలతో చెరువు పరిధిలోని సర్వేనెంబర్లను నిర్ధారిస్తూ కడస్ట్రల్ మ్యాప్ రూపొందించారు. ఇందులో ప్రధానంగా 622 సర్వేనెంబరులో సుమారు 10 ఎకరాల వరకు చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌లో భూ విస్తీర్ణం ఉంటే దానిని దాదాపు 3-4 ఎకరాలకు పరిమితం చేసినట్లు తెలుస్తున్నది. దీంతో పాటు 621 సర్వేనంబర్‌లో కూడా కొంతమేర విస్తీర్ణాన్ని తగ్గించినట్లు పొరుగున ఉన్న రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో మాస్టర్‌ప్లాన్ ప్రకారం తక్కువ విస్తీర్ణం ఉన్న సర్వేనెంబర్లలోకి చెరువును జరిపి అందులో విస్తీర్ణం పెరిగినట్లుగా అధికారులు చూపారు. దీంతో మాస్టర్‌ప్లాన్ ప్రకారం తన భూమిలో 3-4 ఎకరాలకు పరిమితం కావాల్సిన చెరువు విస్తీర్ణం రెట్టింపుకంటే పెరిగిపోయిందని పొరుగు రైతు వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా అధికారులు రూపొందించిన మ్యాప్ ఆధారంగా విల్లా నిర్మాణ ప్రాజెక్టుకు అనుమతులు రావడంతో సదరు నిర్మాణ సంస్థ చెరువులో భారీ ఎత్తున మట్టిని నింపడంతో పాటు చెరువుకు వరదను మోసుకొచ్చే ఫీడర్ ఛానెల్స్, తూములను సైతం ధ్వంసం చేసింది. అందులోనూ పెద్ద ఎత్తున మట్టిని నింపి విల్లాల నిర్మాణాన్ని చేపట్టింది. దీనిపై స్థానికులు కొందరితో పాటు తీవ్రంగా నష్టపోతున్న రైతు వెంకటేశ్ గత ఏడాది, ఏడాదిన్నరగా అధికారులకు ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. కిందిస్థాయి ఏఈఈ మొదలు జిల్లా కలెక్టర్, ఏసీబీ, విజిలెన్స్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదాకా అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరూ స్పందించడంలేదని వెంకటేశ్ ఆవేదన చెందుతున్నారు. కాగా ఇన్నాళ్లూ అధికారులు గీసిన గీతల ప్రకారమే చెరువుగా చెలామణి అవుతూ వచ్చింది.
వరుస ఫిర్యాదులు వస్తుండటంతో కంటితుడుపు చర్యగా నీటిపారుదల శాఖ అధికారులు ఒక పర్యాయం సర్వే చేసి కేవలం ప్రహరీగోడ కొంత వరకు ఎఫ్టీఎల్, బఫర్ పరిధిలోకి వచ్చిందంటూ కూల్చివేశారు. కానీ ఆతర్వాత నిర్మాణ సంస్థ దానిని కూడా పునరుద్ధరించింది. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వెంగళయ్య చెరువుకు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చింది. నిర్మాణ సంస్థ-అధికారులు నిబంధనల్ని ఏమార్చగలిగారేగానీ… ప్రకృతిని మాత్రం మభ్యపెట్టలేకపోయారనేది దీని ద్వారా రుజువైంది. భారీ వరద రావడంతో సదరు నిర్మాణ సంస్థ ఎగువన ఉన్న పొలాల వారితో మాట్లాడుకొని అడ్డుగా పెద్ద ఎత్తున మట్టిని అడ్డుగా పోసింది.
అయినప్పటికీ వరద ధాటికి ఆ మట్టి కట్ట కూడా తాళలేకపోయింది. వర్షాల సమయంలో విల్లాల మధ్యలో నుంచి పెద్ద వరద పోయిందని పలువురు రైతులు చెబుతుండగా… ఇప్పటికీ విల్లాల చుట్టూ వరద నీరు నిలిచిన దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవేకాకుండా ఈ నిర్మాణ ప్రాజెక్టులో అనుమతి తీసుకున్న సర్వేనెంబర్లకు ఆనుకొని ఉన్న అసైన్డ్ భూములను కూడా కలుపుకొని విల్లాల నిర్మాణం చేపడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే రెరా, హెచ్ఎండీఏ అనుమతుల్లో ప్రాజెక్టు విస్తీర్ణం 37 ఎకరాలు ఉంటే… క్షేత్రస్థాయిలో మాత్రం విస్తీర్ణం 43 ఎకరాల వరకు ఉంటుందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విల్లా ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద రావడం… వరద నీరు నిలిచిన ఆనవాళ్లు ఉండటంతో బాధిత రైతు వెంకటేశ్ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా సీఐ తిరుమలేశ్ సుమారు 20 రోజుల కిందట క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. మాస్టర్‌ప్లాన్ ప్రకారం చెరువు రూపం… సర్వేనెంబర్లను మార్చిన తర్వాత కాగితాలపై చెరువు స్వరూపంతో పాటు సీఐకి పలు ఆధారాలు ఇచ్చినట్లు వెంకటేశ్ తెలిపారు. అయితే ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని బాధిత రైతు వాపోతున్నారు. పైపెచ్చు ఇన్నాళ్లూ ఏం చేశావ్? అంటూ తనపైనే హైడ్రా అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారని, కానీ తాను ఏడాదిగా ఎంతమంది అధికారులు, శాఖలకు ఫిర్యాదులు చేశాననే వివరాల్ని ఇచ్చినప్పటికీ తనను అవమానించేరీతిలో సదరు అధికారి మాట్లాడుతున్నట్లు వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేవారు.
నీటిపారుదల శాఖ అధికారులు నిర్మాణ సంస్థతో కుమ్మక్కై చెరువు స్వరూపాన్ని మార్చారని వెంకటేశ్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై ఇంకా చెరువును నోటిఫై చేయలేదని, హైడ్రా కమిషనర్ కానీ, ఎస్ఈ కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించి చెరువు హద్దులను నిర్ధారించిన తర్వాత ఆక్రమణలుంటే చర్యలు తీసుకుంటామని హైడ్రా సీఐ తిరుమలేశ్ చెప్పారు. ఫిర్యాదు వచ్చిన తర్వాత తాము ఆ ప్రాంతానికి వెళ్లివచ్చామని, ఇరువర్గాలతో మాట్లాడినప్పుడు ఇన్ఫ్రా సంస్థకు అన్ని అనుమతులు ఉన్నాయని, అయితే చెరువులో కట్టారా లేదా అనేది చెరువు నోటిఫై అయిన తర్వాతే తెలుస్తుందని తిరుమలేశ్ చెప్పారు.