మేడ్చల్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్పై ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. పార్టీని ఇంటి పార్టీగా ప్రజలు భావిస్తున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా ఉంటున్నారు. పార్టీ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారు. భవిష్యత్‌లో కూడా టీఆర్ఎస్ తప్పా ఇతర పార్టీల అడ్రస్ గల్లంతు కానున్నది. తనపై నమ్మకంతో అప్పగించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని బాధ్యతగా భావిస్తున్నా. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. ఆదివారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడారు.
అందరినీ కలుపుకుని పోతా..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉంది. మరింత పటిష్టం చేసేందుకు అనుభవజ్ఞలైన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మైనంపల్లి హన్మంతరావు, మాధవరం కృష్ణరావు, బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, మున్సిపల్, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, అందరితో కలిసి సమష్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తాం. వారి అనుభవాన్ని ఉపయోగించుకుని పార్టీని తిరగులేని శక్తిగా మారుస్తా. విద్యార్థి, యువజన, మహిళా నాయకులకు పార్టీలో అధిక ప్రాధాన్యతను ఇచ్చే విధంగా కృషి చేస్తా. ఉద్యమంలో పనిచేసిన అనుభవంతో పార్టీని ముందుకు నడిపిస్తా. అందరి సలహాలు, సూచనలు తీసుకుంటా.
పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రచారం..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్నది తెలుసుకుంటా. అన్ని వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై విస్తృత ప్రచారం చేస్తాం. పథకాలు అందని అర్హులకు స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో అందించే విధంగా కృషిచేస్తా. పార్టీ జిల్లా కార్యాలయంలో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకుంటూ ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేస్తాం. పార్టీ కోసం కష్టపడే వారిని అధిష్టానం గుర్తిస్తుందన్న విషయం నాయకులు, కార్యకర్తలకు తెలుసు.
అన్ని వర్గాల మద్దతు టీఆర్ఎస్కే..
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలని ప్రజలందరూ నిర్ణయం తీసున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజల మద్దతు ఎప్పటికీ టీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీలను ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ సభ్యత్వాన్ని తీసుకుని పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నారు.
ఆ రెండు పార్టీలది లోపాయికారి ఒప్పందం..
బీజేపీకి లీడర్ లేడు. కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు. తెలంగాణ ప్రజలందరూ చైతన్యవంతులు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను సమ్మె పరిస్థితులలో లేరు. కాంగ్రెస్, బీజేపీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్న విషయాన్ని ప్రజలు గుర్తించారు. ఇటీవల హుజురాబాద్‌లో జరిగిన శాసనసభ ఎన్నికే ఇందుకు నిదర్శనం. రానున్న శాశనసభ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ తప్పా ఇతర పార్టీలు ఉండే అవకాశం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించారు. బీజేపీ, కాంగ్రెస్‌లను ప్రజలు చీదరించుకుంటున్నారు. త్వరలోనే బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ప్రజలు బుద్ధిచెప్పే సమయం రావడం ఖాయం.