చిక్కడపల్లి, జనవరి 14 : జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ సోమయ్య అన్నారు. ఎన్టీవీలో వచ్చిన ఓ కథనానికి జర్నలిస్టులు దొంతు రమేశ్, పరిపూర్ణాచారి, సుధీర్లను బాధ్యులను చేస్తూ సిట్ పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం దారుణమన్నారు. మీడియాలో వచ్చే కథనాలకు ఆ సంస్థ ఎడిటర్, బోర్డు ఆఫ్ డైరెక్టర్లతోపాటు సంస్థ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కానీ ఆ సంస్థలో పని చేసే జర్నలిస్టులు, ఇతర ఉద్యోగులను బాధ్యులను చేసి అరెస్టు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సమజ శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడే సదరు జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలోనూ ముందుండి పోరాటం చేశారని తెలిపారు. అక్రమ అరెస్టులు ఇతర జర్నలిస్టులను భయపెట్టేందుకు చేస్తున్న చర్యలని అన్నారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అరెస్టులు అప్రజాస్వామికం
అబిడ్స్, జనవరి 14: ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని గోషామహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ఎం.ఆనంద్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గౌలిగూడలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి విచారణ జరపకుండా అర్ధరాత్రి వేళలో ఇండ్లలోకి చొరబడి జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్‌లు చేసి కుటుంబ సభ్యులను భయాందోళనకు గురయ్యే విధంగా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన జర్నలిస్ట్‌లను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వార్తల ప్రసారంలో అభ్యంతరాలు ఉంటే ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, కానీ ప్రభుత్వం విలేకరులపై కక్షకట్టి ఇష్టానుసారంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు.
కక్ష్యసాధింపు చర్యలే
ముషీరాబాద్, జనవరి 14: ప్రభుత్వ కక్ష్యసాధింపు చర్యల్లో భాగంగానే జర్నలిస్టుల అక్రమ అరెస్టులని బీఆర్ఎస్ అడిక్‌మెట్ డివిజన్ మాజీ అధ్యక్షుడు నేత శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేశారంటూ నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టులను అరెస్టు చేయడం అన్యాయమని ఒక ప్రటనలో పేర్కొన్నారు. పోలీసులు న్యాయబద్దంగా నడుచుకోకుండా కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మీడియా సంస్థలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవాలనే ఉద్ద్యేశంతో అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని ఆరోపించారు.