దుండిగల్, ఆగస్టు 5: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసంబద్ధ ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తిప్పికొట్టాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్లో మంగళవారం ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను కార్యకర్తలు వీక్షించేందుకు వీలుగా గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లైవ్‌షో ఏర్పాటు చేశారు.
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేలు వివేకానంద్, కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో నిరాధరణకు, నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు అపరభగీరథుడు, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. గొప్ప విజన్‌తో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కావాలనే రాజకీయం చేస్తోందన్నారు.
ఇది హరీశ్‌రావు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో మరోసారి స్పష్టమైందన్నారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్ట్‌తో తెలంగాణను సస్యశ్యామలం చేసి దేశంలోనే అత్యధిక వరి దిగుబడిని ఇచ్చే రాష్ట్రంగా తీర్చిదిద్దిన దార్శనికులు కేసీఆర్‌పై అవినీతి మరక అంటించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుటిలయత్నాలు చేస్తోందని ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
దీనిని ప్రజలంతా గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలను కార్యకర్తలు ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ కృష్ణతో పాటు మేడ్చల్ జిల్లాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నివేదిక తప్పుల తడక: ఎమ్మెల్యే కృష్ణారావు
కేపీహెచ్‌బీ కాలనీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నివేదిక తప్పుల తడకని, కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించమే లక్ష్యంగా తయారు చేశారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. నివేదిక ఏకపక్షంగా ఉందని, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులను అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు.
కేంద్ర ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేవలం రెండు పిల్లర్లు కుంగిపోతేనే కాంగ్రెస్ ప్రభుత్వం రాద్ధాతం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో తప్పిదాలు జరిగాయని, ఎస్ఎల్బీసీ టన్నెల్లు కూలిపోయాయని కార్మికులు, ఇంజినీర్లు చనిపోయారని దానికి కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ్ట నేతలపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు