Kaleido Khel A Thon | హైదరాబాద్, ఏప్రిల్ 26: పరిమితులు కేవలం శరీరానికే తప్ప.. సాధించాలనే సంకల్పానికి కావని నిరూపించింది ‘కలైడో ఖేల్-ఏ-థాన్’. ది గుడ్ టాక్ ఫ్యాక్టరీ (TGTF) ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్లో నిర్వహించిన ‘ఆన్ ఇంక్లూజివ్ స్పోర్ట్స్ 4 ఆల్ 5కె రన్’ నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంది.
“క్రీడలు అందరి సొంతం” (Sports Belong to Every-BODY) అనే నినాదంతో సాగిన ఈ పరుగులో కుల, మత, వయో భేదాలు లేకుండా వందలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ పరుగును ఉద్దేశించి TGTF వ్యవస్థాపకులు రఘు మాట్లాడుతూ.. సమాజంలో సమ్మిళిత భావాన్ని (Inclusivity) పెంపొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా క్రీడల పట్ల మక్కువ ఉన్న ప్రతి ఒక్కరికీ భరోసా కల్పించవచ్చని ఆయన ఆకాంక్షించారు.

Kaleido Khel A Thon1
ఈ వేడుకలో సినీ నటుడు రాగ్ మయూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారత దివ్యాంగుల క్రికెట్ జట్టు కెప్టెన్ మహేష్ దీరావత్,హైదరాబాద్ రోడ్ వారియర్ అరుణ్ బతుల, ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (IACC) ఛైర్మన్, శ్రీదేవి దేవిరెడ్డి టై (TiE) హైదరాబాద్ సీనియర్ డైరెక్టర్, శాంతల వైగాస్, ఆరా (Aura) గ్లోబల్ బిజినెస్ స్కూల్ వాణి మేక, గుర్తింపు ఫౌండేషన్ వసుంధర కొప్పుల, వీరితో పాటు స్ప్రైపుల్, యూనిస్లింక్ సంస్థల ప్రతినిధులు ఈ పరుగులో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.
సాధారణ పరుగు పందెంలా కాకుండా, ఇది పూర్తిగా సంఘీభావ పరుగుగా సాగింది. వందలాది మంది దివ్యాంగులు వీల్చైర్లపై ఉత్సాహంగా ముందుకు సాగగా, వారికి తోడుగా యువత, వృద్ధులు అడుగులు వేశారు. నెక్లెస్ రోడ్ అంతటా ఐక్యత, మానవత్వపు పరిమళాలు వెదజల్లినట్లుగా ఈ దృశ్యం కనిపించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని విశేషాలను నిర్వాహకులు వారి సామాజిక మాధ్యమ వేదికల్లో పంచుకున్నారు.