సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టీజీ-సాక్స్)లో ఒక ప్రైవేటు కన్సల్టెన్సీకి చెందిన ఓ మహిళా పెత్తనంపై ‘ఆమె చెప్పిందే శాసనం’శీర్షికన నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనంపై ఆ శాఖ స్పందించింది. టీజీ సాక్స్‌లో సర్వాధికారాలను ఇన్చార్జి పీడీగా ఉన్న హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనరే ఉపయోగిస్తున్నారని, అన్ని రకాల అధికారిక కార్యకలాపాలు, పరిపాలనా అంశాలను సదరు అధికారే పర్యవేక్షిస్తున్నారని వివరణ ఇచ్చారు.
సాక్స్‌కు సంబంధించిన అధికార కార్యకలాపాల్లో ప్రైవేటు కన్సల్టెంటైన సదరు మహిళా ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని, కేవలం టెక్నికల్ సపోర్ట్ మాత్రమే అందిస్తున్నారని, వార్తా కథనంలో ప్రచురితమైన ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ నిరాధారమైన ఆరోపణలే అంటూ సదరు శాఖ మొక్కుబడి వివరణ ఇచ్చింది. ప్రచురితమైన వార్తా కథనంలోని అంశాలను ఏమాత్రం ప్రసావించకుండా, వాటిపై వివరణ ఇవ్వకుండా కేవలం ప్రైవేటు కన్సల్టెంట్ అధికారిక కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం లేదు, పరిపాలనా తదితర కార్యకలాపాలన్ని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇన్చార్జి ప్రాజెక్ట్ డైరెక్టరే పర్యవేక్షిస్తున్నట్లు సదరు శాఖ వివరించింది.
2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించిన రూ.7.56కోట్ల నిధులు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(న్యాకో)కు వెనక్కి మళ్లిపోయిన అంశంపై వివరణ ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతే కాకుండా 2025 నుంచి 2026మార్చిలోపు హెచ్ఐవీ రోగుల చికిత్స, ఇతర అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన నిధులను ఖర్చుచేయకుండా ఎందుకు, ఎవరి కోసం పక్కనబెట్టారు, చివరి నిమిషంలో మార్చి 31న అందులో నుంచి సుమారు కోటి రూపాయల నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు మళ్లించడంపై కూడా ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.